తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మొదట్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీష్ రావుని ఉద్దేశ్యించి పరోక్షంగా చురుకలు వేశారు. కానీ ఇప్పుడు నేరుగా అయన పేరు చెప్పి ‘గుంటనక్క’ అని మాట్లాడుతున్నారు.
“తిమింగలం వంటి మేఘా కృష్ణారెడ్డితో పోలిస్తే సృజన్ రెడ్డి చాలా చిన్న చేప. ఆ గుంట నక్క మేగా కృష్ణారెడ్డికి ఈ టెండర్లు దక్కించాలని పావులు కదుపుతోంది. సింగరేణి బొగ్గు గనుల టెండర్ల వ్యవహారంలో గుంటనక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగానే కేటీఆర్ కూడా ప్రెస్ పెట్టి అదే పాట పాడారు.
అసలు ఆ గుంటనక్కతో స్నేహం చాలా ప్రమాదమని చెపుతున్నా కేటీఆర్ వినడం లేదు. దానినే నమ్ముకొని తిరుగుతున్నారు. ఏదో రోజు గుంటనక్క కొంప ముంచక మానదు,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో అన్న కేటీఆర్‌తో కవిత ఏకీభవించారు. దాని విచారణ కార్తీక దీపం డెయిలీ సీరియల్లా అంతూ పొంతూ లేకుండా సాగుతోందన్నారు. సిట్ విచారణతో ఒరిగేదేమీ లేదన్నారు.
వచ్చే ఎన్నికలలో తెలంగాణ జాగృతి గెలిచి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ రెండూ తుడిచిపెట్టుకుపోతాయని, బిజేపి ఎప్పటిలాగే మూడో స్థానంలో పరిమితం అవుతుందని కల్వకుంట్ల కవిత అన్నారు.
తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అడ్డుకున్నానని చెప్పుకుంటున్నారని, కానీ ఆయనే తెలంగాణ జాగృతిలోకి వస్తే మంచి పదవి ఇస్తానని కల్వకుంట్ల కవిత ఆఫర్ ఇచ్చారు.
వచ్చే ఎన్నికలలో గెలవడం బీఆర్ఎస్ పార్టీకి చాలా అవసరం లేకుంటే ఆ తర్వాత కేసీఆర్ ఆరోగ్య కారణాల చేత రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి రావచ్చు. అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీని దెబ్బ తీయడానికి కాంగ్రెస్, బిజేపిలు కాచుకు కూర్చున్నాయి. కనుక వచ్చే ఎన్నికలలో గెలిఛి అధికారంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ సర్వ శక్తులు ఒడ్డి పోరాడుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం నిలుపుకునేందుకు సర్వశక్తులు ఒడ్డి పోరాడటం ఖాయం. వాటి మద్యలో ‘గేమ్ చేంజర్’ బిజేపి ఉండనే ఉంది. ఈ మూడు పార్టీల మద్య తెలంగాణ జాగృతి నలిగిపోకుండా ఉంటే అదే పదివేలు!






