
తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2022, నవంబర్‌లో మునుగోడు శాసనసభ ఉప ఎన్నికలు జరిగాయి. సీపీఐ, సీపీఎంల మద్దతు లేనిదే కాంగ్రెస్ పార్టీని ఓడించలేమని గ్రహించిన కేసీఆర్, ఆ రెండు పార్టీల నేతలని ప్రగతి భవన్‌కి ఆహ్వానించి పొత్తులు కుదుర్చుకున్నారు. వాటి మద్దతుతో ఉప ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది.
ఆ పొత్తు 2023, డిసెంబర్ శాసనసభ ఎన్నికలలో కూడా కేసీఆర్ కొనసాగిస్తారని, తమకి కొన్ని సీట్లు కేటాయిస్తారని వామపక్ష నేతలు భావించారు. కానీ కేసీఆర్ వాటిని పట్టించుకోకుండా మొత్తం సీట్లన్నీ తమ పార్టీ అభ్యర్ధులకే ప్రకటించి వారికి షాక్ ఇచ్చారు. తమ అవసరం తీరాక పులిహోరలో కరివేపాకులా కేసీఆర్ తీసి పడేశారని వామపక్ష నేతలు రగిలిపోయారు.
Also Read – గులక రాయి తగలడం వల్లనే జగన్‌కి మతిమరుపు?
ఇప్పుడు తండ్రి ఆగ్రహించడంతో తెలంగాణ రాజకీయాలలో ఏకాకిగా మిగిలిపోయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వామపక్షాల మద్దతు కోసం వచ్చారు. ప్రస్తుతం ఆమె బిఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉండిపోవలసి రావడంతో, రాజకీయంగా తన ఉనికి కాపాడుకోవడం చాలా ముఖ్యం. కనుక బీసీల రిజర్వేషన్స్ అంశం భుజానికెత్తుకొని దాని కోసం సమావేశాలు నిర్వహిస్తూ, మీడియా మాట్లాడుతున్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ రావాలంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, కనుక జూలై 16,17,18 తేదీల ‘రైల్ రోకో’ నిర్వహించాలని నిర్ణయించారు.
Also Read – ఇండోసోల్ నిర్వాసితులను జగనే కాపాడాలట!
ఇపుడు ఆమె వెంట బిఆర్ఎస్ పార్టీ లేదు. తెలంగాణ జాగృతి అనామక నేతలతో ఈ రైల్ రోకో కార్యక్రమానికి ఎటువంటి గుర్తింపు, స్పందన లభించదు. కనుక కల్వకుంట్ల కవిత వామపక్ష నేతలని కలిసి ‘రైల్ రోకో’కి మద్దతు ఇవ్వాలని కోరారు. తాము అంతర్గతంగా చర్చించుకున్న తర్వాత తమ నిర్ణయం తెలియజేస్తామని వారు చెప్పరు.
గతంలో కేసీఆర్ చేసిన మోసం వారు ఇంకా మరిచిపోలేదు. ఆమె కూడా కేసీఆర్‌లాగే తన రాజకీయ మనుగడ కాపాడుకొని పెంచుకోవడానికే ఈ బీసీ రిజర్వేషన్స్ అంశం భుజానికెత్తుకున్నారని, ఆమె కూడా తమని వాడుకొని అవసరం తీరాక వదిలేస్తారని దేశ ముదురు వామపక్ష నేతలకు తెలియదనుకోలేము. కనుక వామపక్షాలు ఆమెకు మద్దతు ఇస్తాయా లేదా? త్వరలో తెలుస్తుంది.