నాడు చిరంజీవి ప్రజారాజ్యం దుకాణం మూసేసి కాంగ్రెస్ చేతికి అప్పగించేసిన తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించడం చాలా సాహసమనే చెప్పాలి. అదీ ఆయన హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ పార్టీ అన్నట్లు ప్రారంభించడంతో చాలా మంది ఎద్దేవా చేశారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కల్వకుంట్ల కవిత ‘అదొక ఓపెన్ అండ్ షట్ పార్టీ’… ప్రజారాజ్యం లాగే మూతపడుతుంది. ఎక్కువ రోజులు ఆడదంటూ ఎద్దేవా చేశారు.
ఇప్పుడు ఆమె టీఆర్ఎస్ పార్టీ గురించి కాంగ్రెస్, బిజేపి నేతలు అలాగే ఎద్దేవా చేస్తున్నారు. ఆమె ఎవరు వదిలిన బాణమో? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి ఆమెకి ఫండింగ్ చేస్తున్నారని బిజేపి, మోడీ ప్రోత్సాహంతో ఆమె పార్టీ పెట్టారని, అందుకే ఆమెకు ‘టీఆర్ఎస్’ లభించిందని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు.
వీటిపై ఆమె స్పందిస్తూ, “రాజకీయాలలో పార్టీ పేర్లు, ఎన్నికల గుర్తులు వంటి మార్పులు సహజం. అలాగే నాడు ఎన్టీఆర్, కేసీఆర్ కూడా పార్టీ స్థాపించినప్పుడు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణలో గులాబీ జెండా పట్టుకునేవారే లేరు. కానీ క్రమంగా వటవృక్షంలా ఎదిగాయి. మా పార్టీ కూడా అలాగే ఎదుగుతుంది.
కనుక ఇలాంటి వెటకారాలు, అవహేళనలకు భయపడి నేను వెనక్కు తగ్గను. ఎందుకంటే నా లక్ష్యం తెలంగాణలో అధికారంలోకి వచ్చి సామాజిక న్యాయం చేయడమే.
ఈ లక్ష్యం సాధించే వరకు రాష్ట్రం, ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తాను. అందుకు సిద్దపడే ఒంటరిగా ఈ ప్రయాణం మొదలుపెట్టాను. అప్పుడే నాతో అనేకమంది కలిసి నడుస్తున్నారు. భవిష్యత్‌లో మా పార్టీ కూడా వటవృక్షంగా మారి అందరికీ నీడనిస్తుంది,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.
మొదట పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు చులకనగా మాట్లాడిన ఆమెకు, ఇప్పుడు తన పార్టీ గురించి ఇతరులు చులకనగా మాట్లాడుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో అర్ధమవుతోంది.
నాడు పవన్ కళ్యాణ్‌ని ఎద్దేవా చేసిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు ఆయనలాగే మాట్లాడుతున్నారు. ఆయన పేరు ప్రస్తావించకపోయినా ఆయన మార్గంలోనే నడుస్తానని చెపుతున్నారన్న మాట!




