తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు మేడ్చల్ జిల్లాలోని అవుటర్ రింగ్ రోడ్ సమీపంలో గల మునీరాబాద్ వద్ద గల ఓ ఫంక్షన్ హాల్లో తన కొత్త పార్టీ ప్రకటిస్తానని చెప్పారు.
“దేశంలో ఎవరైనా కొత్త పార్టీ పెడితే ఫలానా పార్టీకి బీ-పార్టీ, సి-పార్టీ అంటారు. కానీ మా పార్టీ దేనికీ బీ పార్టీ కాదు. కేవలం తెలంగాణ రాష్ట్రం, అన్ని వర్గాల ప్రజల కోసమే మా పార్టీ పని చేస్తుంది. టిఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళాలనే ఉద్దేశ్యంతో పార్టీ పేరుని బీఆర్ఎస్ పార్టీకి మార్చుకొని రెంటికీ చెడింది. కనుక తెలంగాణలో బలమైన ప్రాంతీయపార్టీ లేకుండా పోయింది. అది మాదే అవుతుంది.
బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా మావైపే ఉన్నారు. రేపు పార్టీ ప్రకటించిన తర్వాత అందరూ చూస్తారు. సాధారణంగా రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకవిధంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో విధంగా వ్యవహరిస్తుంటాయి. కానీ మేము ఇప్పుడు ఎలా ఉంటామో రేపు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉంటాము.
శ్రీరాముడు ప్రజల మాట వింటూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేవారు. నేను ఏర్పాటు చేస్తున్న ఈ పార్టీ కూడా కూడా ఆయన స్పూర్తితోనే అదేవిధంగా పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రం, ప్రజల కోసం పనిచేయాలనుకునే ప్రతీ ఒక్కరినీ కలుపుకుపోతాం. మాకు ఎలాంటి భేషజాలు లేవు,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.
LIVE: Addressing media at Nizamabad https://t.co/NGEkyav4nd
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 27, 2026






