కల్వకుంట్ల కవిత నిన్న శ్రీరామ నవమి సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి రెండు మూడుసార్లు ‘మేము ఎన్నికలలో గెలిచి అధికారంలో వచ్చాక…’ అంటూ మాట్లాడారు.
కనీసం పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటించక మునుపే ఆమె ఈవిధంగా మాట్లాడటం కొంతమందికి అతిశయంగా అనిపించవచ్చు. కానీ అది ఆమె ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా కూడా చూడవచ్చు.
పార్టీకి నాయకత్వం వహించేవారిలో ఈ స్థాయిలో నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే ఇది కాలక్షేపానికి చేస్తున్న రాజకీయాలు కాదని బలమైన సంకేతం పంపినట్లవుతుంది. అప్పుడే ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు వచ్చి చేరుతారు. ప్రజలకు కూడా నమ్మకం కలుగుతుంది.
కేసీఆర్ ఫామ్‌హౌసుకి పరిమితమవుతూ కేటీఆర్‌కి పార్టీ పగ్గాలు అప్పగించిన తర్వాత ఆయనలో ఈ స్థాయి ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు. సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి చులకనగా, ఎగతాళి చేస్తూ మాట్లాడటమే ధైర్యం, సాహసం, నాయకత్వ లక్షణాలు అని భావిస్తున్నారు.
ఇదివరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అచ్చం ఇదేవిధంగా వ్యవహరించేవారు. చంద్రబాబు నాయుడుని తిడుతూ, పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించి చులకనగా మాట్లాడటమే రాజకీయమనుకున్నారు. కానీ చివరికి ఏమయిందో అందరికీ తెలుసు.
కానీ కల్వకుంట్ల కవిత జగన్, కేటీఆర్‌లకు భిన్నంగా పూర్తి ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకున్న తర్వాత ఇటు ప్రాంతీయపార్టీ అనిపించుకోలేక అటు జాతీయపార్టీగా ఎదగలేక రెంటికీ చెడిందని, కనుక తెలంగాణలో జాగృతి మాత్రమే ప్రాంతీయ పార్టీ అని కల్వకుంట్ల కవిత చెప్పడం ఆమె ఆత్మవిశ్వాసానికి మరో నిదర్శనం.
ఆమె పార్టీ ఏర్పాటు చేసుకున్నాక మొట్ట మొదట బీఆర్ఎస్ పార్టీనే నిలువునా చీల్చుతారని ముందే చెప్పుకున్నాము. నిన్న మీడియా సమావేశంలో ఓ ప్రశ్నకు జవాబు చెపుతూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ మాతోనే ఉన్నాయని చెప్పడమే ఇందుకు ఉదాహరణ.
కల్వకుంట్ల కవిత మూడు పార్టీలను తట్టుకొని నిలబడగలరా లేదా? ఎన్నికలో పోటీ చేసి పోరాడగలరా లేదా? గెలిచి అధికారంలోకి రాగలరా లేదా? అనేవన్నీ అప్రస్తుతం. కానీ చాలా బలమైన నిర్ణయంతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.






