హమ్మయ్యా… అన్నా, చెల్లికి గురి కుదిరింది!

Kavitha vs KTR: New Trouble Brewing in BRS Party

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని రెండుగా విభజించిన కేసీఆర్‌ కుటుంబం, బీఆర్ఎస్‌ పార్టీ కూడా రెండుగా చీలిపోవడం యాదృచ్చికమే కావచ్చు. కానీ నాడు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎంతగా బాధ పడ్డారో నేడు కల్వకుంట్ల కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్‌ పార్టీ సభ్యులు బహుశః అదే విధంగా బాధపడుతుంటారు.

కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్‌ పార్టీ ఏర్పాటు చేసుకున్న తర్వాత కొన్ని రోజులు బీఆర్ఎస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. కానీ ఆమె కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావు ముగ్గురినీ పేరు పెట్టి మరీ విమర్శిస్తున్నా, వారిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు.

ADVERTISEMENT

ఒంటి చేత్తో చప్పట్లు మోగవు కనుక వారి నిర్లిప్త వైఖరి పట్ల ఆమెకి విసుగొచ్చిందో ఏమో, ఇప్పుడు ప్రజా సమస్యలపై పోరాటాలు మొదలుపెట్టారు. రైతుల నుంచి ధాన్యం, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు వగైరా కొనుగోలు చేయాలంటూ నేడు ఆమె తన పార్టీ శ్రేణులతో కలిసి తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేశారు. ఇది బీఆర్ఎస్‌ పార్టీకి ముఖ్యంగా కేసీఆర్‌, కేటీఆర్‌లకు పెద్ద ఉపశమనమే అని చెప్పవచ్చు.

కనుక కేటీఆర్‌ కూడా మళ్ళీ సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి ఎప్పటిలాగే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాలు చేసుకుంటున్నారు. బండి భగీరథ్‌ అరెస్ట్ విషయంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌, సిఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కు అయ్యారంటూ తీవ్ర విమర్శలు చేశారు.

ఈవిధంగా అన్నా చెల్లీ పరస్పరం కీచులాడుకోకుండా ఇద్దరూ వేర్వేరుగా సిఎం రేవంత్ రెడ్డిపై బాణాలు సందించడం చూస్తుంటే రెండు పార్టీలు గాడిన పడినట్లే అనిపిస్తోంది.

కానీ “కేవలం ప్రజా సమస్యలపై పోరాడితే సరిపోదు. పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావాలి,” అని కల్వకుంట్ల కవిత రాజకీయ ఫార్ములా చెప్పేశారు కనుక బీఆర్ఎస్‌ పార్టీ సీనియర్ నేతలను టీఆర్ఎస్‌ పార్టీలోకి ఆకర్షించక తప్పదు.

అప్పుడు మళ్ళీ ‘న్యూ టీఆర్ఎస్‌’, ‘ఓల్డ్ టీఆర్ఎస్‌’ పార్టీల మద్య రాజకీయ యుద్ధాలు మొదలవుతాయి. కనుక ప్రజా సమస్యలపై పోరాటాలు సినిమాలలో ఇంటర్వెల్ వంటివని భావించాల్సి ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories