ఈ నెల 25 న తెలంగాణ రాజకీయాలలో కొత్త నెత్తురుతో కొత్త రాజకీయం అంటూ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. తన పార్టీ ప్రకటన రోజు పార్టీ అద్భుతమైన ఎజెండాను ప్రకటిస్తానని, అది తెలంగాణ భవిష్యత్ ని మార్చబోతుందంటూ తెలియచేసారు.
అలాగే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన అటు ప్రతిపక్ష బిఆర్ఎస్ పైన కూడా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ సర్కార్ అబద్దాలతో తెలంగాణ ప్రజలను వంచిస్తుంటే, బిఆర్ఎస్ అచేతన స్థితిలో నిద్రావస్థలో ఉందంటూ ఆరోపించారు. అయితే కవిత మొదటి నుంచి బిఆర్ఎస్ టార్గెట్ గానే రాజకీయం చేస్తూ వస్తున్నారు.
అందుకోసం ముందుగా బిఆర్ఎస్ కీలక నేతలైన హరీష్ రావు, సంతోష్ రావు లను ఎంచుకుని వారి పై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేసారు. బంగారు తెలంగాణ అంటే మీ ఇల్లు బంగారం కావడం కాదని, కాళేశ్వరంతో హరీష్ కేసీఆర్ కి కూడా అవినీతి మరకలు అంటించారంటూ హరీష్ పై రెచ్చిపోయారు.
అలాగే హరీష్ ని బిఆర్ఎస్ కోవర్డ్ గా కేసీఆర్ కట్టప్పగా అభివర్ణించారు. ఇక బిఆర్ఎస్ మాజీ మంత్రులను కూడా లక్ష్యంగా చేసుకుని కవిత వారి పై కూడా అవినీతి ఆరోపణలు చేసారు, అలాగే తన జోలికొస్తే వారి కాళ్ళు విరగొడతా అంటూ హెచ్చరికలు పంపారు.
ఇక బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ రాజకీయ వారసుడు, తన సొంత అన్న కేటీఆర్ కేంద్రంగా కూడా కవిత విమర్శనాస్త్రాలు సంధించారు. అలాగే బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం విచారణ సమయంలో కూడా తెలంగాణ జాతిపిత కేసీఆర్ పై విచారణ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు విచారణకు ఎవరు అతీతులు కాదు అంటూ కౌంటర్ ఇచ్చారు.
ఇలా ముందుగా ఆ పార్టీలోని ముఖ్య నేతల పై అవినీతి ఆరోపణలు చేసి బిఆర్ఎస్ ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలన్నదే కవిత రాజకీయం. ఈ క్రమంలో కవిత కొంత మేర అనుకున్న లక్ష్యాలను అందుకున్నప్పటికీ అంతిమంగా బిఆర్ఎస్ ను రాజకీయంగా దెబ్బకొట్టగలుగుతుందా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న.
అయితే కవిత ఇలా బిఆర్ఎస్ ఓటమి దిశగా పావులు కదుపుతుంటే అటు కేటీఆర్ బిఆర్ఎస్ గెలుపు కోసం రాజకీయ ప్రణాళికలు వేస్తున్నారు. అందులో భాగంగానే రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన హైడ్రా ని ఎంచుకుని హైడ్రా బాధితుల కేంద్రంగా రాజకీయం మొదలుపెట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ ప్రభుత్వమని, పేదల ఇల్లే టార్గెట్ గా రేవంత్ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలు రాష్ట్రంలో ఇప్పటికి అమలు కాలేదంటూ రేవంత్ టార్గెట్ గా చక్రం తిప్పుతున్నారు కేటీఆర్.
ఇక తమ పార్టీ పై అవినీతి ఆరోపణలు చేస్తూ, తమ పార్టీ నేతల టార్గెట్ గా రాజకీయం చేస్తున్న కవిత జాగృతి పట్ల కూడా అప్రమత్తంగానే ఉంటూ బిఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా కవిత ఆరోపణలకు కౌంటర్లు ఇస్తున్నారు. కేసీఆర్ ని మూడో సారి ముఖ్యమంత్రిని చెయ్యడమే తన రాజకీయ లక్ష్యమని, బిఆర్ఎస్ ని అధికారంలోకి తెచ్చేందుకు నిరంతర పోరాటం చేస్తామంటూ కేటీఆర్ కథం తొక్కుతున్నారు.
మరి చూడాలి రానున్న రోజులలో ఈ అన్నా చెల్లెళ్ళ రాజకీయ యుద్ధంలో అన్న గెలిచి చెల్లి ఆశలను అడియాశలు చేస్తాడో లేదా చెల్లి నెగ్గి అన్న నాయకత్వానికి సవాల్ విసురుతుందో. అయితే ఈ ఇద్దరిలో ఎవరు నెగ్గి ఎవరు తగ్గినా అంతిమంగా ఓడేది కేసీఆరే అనేది కవిత, కేటీఆర్ ఇద్దరు గ్రహించలేకపోతున్నారు.




