గుజరాత్‌ బిజెపి కంచుకోటను కేసీఆర్‌ బద్దలు కొట్టగలిగితే….

KCR-Aravind-Kejriwalతెలంగాణ సిఎం కేసీఆర్‌కు మునుగోడు ఉపఎన్నికల టెన్షన్ తీరిపోతే జాతీయ రాజకీయాలలో ప్రవేశించడానికి ఆయనకు ఓ చక్కటి అవకాశం వచ్చింది. అదే.. గుజరాత్ శాసనసభ ఎన్నికలు. డిసెంబర్‌ 5,12 తేదీలలో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈసారి గుజరాత్‌ ఎన్నికలలో ఆమాద్మీ పార్టీ పోటీ చేస్తోంది. ఆ పార్టీ అధినేతతో సిఎం కేసీఆర్‌కు సత్సంబంధాలు ఉన్నాయి కనుక బిజెపికి కంచుకోటగా భావించి గుజరాత్‌లోనే బిజెపిని మట్టికరిపించేందుకు కేసీఆర్‌ ఆమాద్మీ పార్టీకి మద్దతు ఈయవచ్చు.

అలాగే ఇటీవల తన బిఆర్ఎస్‌కు సంఘీభావం తెలిపేందుకు పనిగట్టుకొని హైదరాబాద్‌ వచ్చి కలిసివెళ్ళిన గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలాకు కూడా కేసీఆర్‌ మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్‌ ఇప్పటికే బిఆర్ఎస్‌ పార్టీతో జాతీయ రాజకీయాలలో ప్రవేశించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. కనుక ఆమాద్మీ పార్టీ, వాఘేలాతో ఎన్నికల పొత్తులు పెట్టుకొని గుజరాత్‌ ఎన్నికలలో బిఆర్ఎస్‌ అభ్యర్ధులను బరిలో దించినా ఆశ్చర్యం లేదు.

ADVERTISEMENT

ప్రధాని నరేంద్రమోడీని ఆయన ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దించాలని చాలా పట్టుదలగా ఉన్న కేసీఆర్‌కు గుజరాత్‌ ఎన్నికలు ఓ గొప్ప అవకాశాన్ని కల్పించాయని చెప్పవచ్చు. ఈ ఎన్నికలలో బిజెపిని ఓడగొట్టి ఆమాద్మీ లేదా వాఘేలా గుజరాత్‌లో అధికారంలోకి రాగలిగేలా చేయగలిగితే, కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ఇక తిరుగు ఉండదు. అప్పుడు ఆయన సామర్ధ్యాన్ని, నాయకత్వాన్ని దేశంలో బిజెపియేతర పార్టీలన్నీ అంగీకరించవచ్చు.

కేసీఆర్‌ కూడా ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నారు. పైగా ఇప్పుడు ఆయన చేతిలో బిజెపిపై సంధించడానికి ‘టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు అస్త్రం’ కూడా ఉంది. కనుక కేసీఆర్‌ బిజెపి గుజరాత్‌ కంచుకోటను బద్దలుకొట్టేందుకు బయలుదేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే దేశముదురు బిజెపి పెద్దలు కేసీఆర్‌ ఈవిదంగా చేయవచ్చని ఊహించే ఉంటారు కనుక వారు కూడా కేసీఆర్‌ని కట్టడి చేయడానికి ‘ఢిల్లీ లిక్కర్ స్కామ్‌’ వంటి అస్త్రాలను సందించవచ్చు. కనుక కేసీఆర్‌-బిజెపి మద్య జరుగబోయే ఈ రాజకీయ చదరంగంలో ఎవరు పైచేయి సాధిస్తారో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

ADVERTISEMENT
Latest Stories