పచ్చ కామెర్లవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నట్లు, రాజకీయ నాయకులకు పదవీ, అధికారం చేతిలో ఉన్నప్పుడు లోకాన్ని జయించేసిన్నట్లు, అందరి కంటే తామే అధికులమని, మేధావులమని అనుకుంటారు.
కేసీఆర్ పదేళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే వ్యవహరించారు. యాదాద్రి ఆలయంలో తన బొమ్మ చెక్కించుకోవడం, గాంధీజీ, అంబేడ్కర్ అంతటివాడినని అని పార్టీ నేతల చేత చెప్పించుకుని, తన చిత్ర పఠానికి పాలాభిషేకాలు చేయించుకోవడం, దేశాన్ని పాలిస్తున్న ప్రధాని నరేంద్రమోడీకి తెలివితేటలు లేవనడం ఇందుకు కొన్ని ఉదాహరణలు.
కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలకు ఏమీ చాతకాదు కనుకనే దేశం అభివృద్ధి చెందలేదని, కనుక దేశాన్ని ఉద్దరించే బాధ్యత తాను స్వీకరిస్తానని కేసీఆర్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అదే సమయంలో యావత్ దేశ ప్రజలు కేసీఆర్ వైపే చూస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ నేతలు కనిపెట్టి చెప్పారు.
దేశోద్ధారణలో భాగంగా కేసీఆర్ ప్రత్యేక విమానం వేసుకొని దేశాటన చేశారు. కానీ ఎవరూ ఆయన నాయకత్వాన్ని, ‘టర్మ్స్ అండ్ కండిషన్స్’, ‘గుణాత్మక మార్పు’ని అంగీకరించలేదు. ఆ తర్వాత కధ అందరికీ తెలిసిందే.
ఆనాడు నేను మాత్రమే బీజేపీని, నరేంద్రమోడీని ఎదిరించి నిలబడి పోరాడగలను. నేను మాత్రమే ఈ దేశాన్ని కాపాడగలను” అని గర్వంగా చెప్పుకున్న కేసీఆర్, శాసనసభ ఎన్నికలలో సొంత రాష్ట్రంలోనే కాంగ్రెస్ చేతిలో ఓడిపోయారు. దీంతో ఇప్పుడు బిఆర్ఎస్ పల్లవి మారిపోయింది.
“దేశంలో బీజేపీని ఎదుర్కోగల శక్తి కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి లేదు. బిఆర్ఎస్, ఆమాద్మీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీజేపీని ఎదుర్కొని పోరాడగలవు,” అని కేటీఆర్ చేత చెప్పిస్తున్నారు. అంటే ‘నేను మాత్రమే’ నుంచి ‘మనమందరం’ వరకు కేసీఆర్ దిగివచ్చారన్న మాట!
కాంగ్రెస్, వామపక్షాలతో సహా 28 ప్రాంతీయ పార్టీలతో కూడిన ఇండియా కూటమి బీజేపీని ఓడించలేదట! కానీ ఆ కూటమిలో కొన్ని ప్రాంతీయ పార్టీలు బీజేపీని ఓడించగలవని కేసీఆర్ చెప్పడం విశేషం. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని తహతహలాడుతున్న కేసీఆర్, మళ్ళీ వాటితో జతకట్టేందుకు ‘సిద్దం’ అవుతున్నారేమో?




