పాపం యశ్వంత్ సిన్హా… మర్యాదలు ఘనం… ప్రాధాన్యత శూన్యం!

Yashwant-Sinha-KCRరాష్ట్రపతి ఎన్నికలలో విపక్ష అభ్యర్ధిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా ఈరోజు హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఆయన కలలో కూడా ఊహించని స్థాయిలో సిఎం కేసీఆర్‌ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కేసీఆర్‌తో సహా మంత్రులు నేరుగా విమానం వద్దకే వెళ్ళి ఆయనను సాదరంగా తోడ్కొని వచ్చారు.

నగరానికి ప్రధాని నరేంద్రమోడీ వస్తే మొహం చాటేసే సిఎం కేసీఆర్‌, రాష్ట్రపతి ఎన్నికలలో ఓడిపోబోతున్న యశ్వంత్ సిన్హాకు ఈ స్థాయిలో ఘనస్వాగతం పలకడం కూడా వ్యూహాత్మకమే అని చెప్పవచ్చు. తన దృష్టిలో మోడీకి ఏమాత్రం విలువలేదని తెలియజేప్పేందుకే ఈవిదంగా చేసి ఉండవచ్చు.

ADVERTISEMENT

తరువాత సిఎం కేసీఆర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు కార్లలో ర్యాలీగా ఆయనను తోడ్కొని తీసుకొని జలవిహార్‌కు తీసుకువెళుతుంటే వేలాది బైకులతో టిఆర్ఎస్‌ కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్‌ తన అడ్డాగా భావించే హైదరాబాద్‌ నగరంపై బిజెపి నేతలు మిడతల దండులా వాలి పూర్తిగా కబ్జా చేయడంతో వారిని చూసి టిఆర్ఎస్‌ శ్రేణులు భయపడాల్సిన అవసరం లేదని తెలియజేసేందుకే సిఎం కేసీఆర్‌, యశ్వంత్ సిన్హా రాకకు అనవసరమైన హైప్ క్రియేట్ చేసి, దానిని ఈవిదంగా వాడుకొన్నారని చెప్పవచ్చు.

ఆ తరువాత యశ్వంత్ సిన్హాకు మద్దతుగా జలవిహార్‌లో సిఎం కేసీఆర్‌ అధ్వర్యంలో సమావేశం జరిగింది. రాష్ట్రపతి ఎన్నికలలో ఓడిపోబోతున్న తనకు సిఎం కేసీఆర్‌ ఇంత కనీవినీ ఎరుగని స్థాయిలో ఘనంగా స్వాగతం పలికి, ఇంత పెద్ద ర్యాలీ నిర్వహించడం చూసి బహుశః యశ్వంత్ సిన్హా కూడా ఆశ్చర్యపోయి ఉండవచ్చు. కానీ టిఆర్ఎస్‌ హడావుడి, ఆ ర్యాలీ… అన్నీ హైదరాబాద్‌లో మొదలైన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు పోటీగా నిర్వహించినట్లే భావించవచ్చు.

ఇక యశ్వంత్ సిన్హాకు మద్దతు సభలో ఆయన గుణగణాల గురించి మాట్లాడి, ఈ వేదిక నుంచి దేశంలో అన్ని పార్టీలను ఆయనకు మద్దతు ఇమ్మని కోరుతారని అందరూ భావించగా, సిఎం కేసీఆర్‌ గంటన్నర సేపు హిందీలో ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్రమోడీని విమర్శించడానికే పరిమితమయ్యారు.

ఇవాళ్ళ, రేపు హైదరాబాద్‌లో జరుగుతున్న సమావేశాలు, బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోడీతో సహా బిజెపి అగ్రనేతలు తన ప్రభుత్వంపై చేస్తున్న, చేయబోయే విమర్శలను తిప్పి కొట్టేందుకే సిఎం కేసీఆర్‌ ఇవాళ్ళ యశ్వంత్ సిన్హాను ఉపయోగించుకొన్నట్లు అర్దమవుతోంది.

ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశ్యించి అనేక ప్రశ్నలు అడిగి “నేను ఈ దేశ ప్రజలందరి తరపున అడుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికీ రేపు జరుగబోయే బిజెపి సభలో తప్పక మీరు సమాధానాలు చెప్పాలని” డిమాండ్ చేశారు. కనుక ప్రధాని నరేంద్రమోడీకి, వివిద రాష్ట్రాల నుంచి వచ్చిన బిజెపి నేతలకు అర్దమయ్యేందుకే సిఎం కేసీఆర్‌ హిందీలో ప్రసంగించారని స్పష్టమవుతోంది.

ఆయనకు మద్దతు సభ సిఎం కేసీఆర్‌ ఈ సభలో సుదీర్గంగా హిందీలో ప్రసంగించారు. అయితే యశ్వంత్ సిన్హా గురించి ముచ్చటగా మూడు ముక్కలే మాట్లాడి, గంటన్నరకు పైగా ప్రధాని నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేశారు. అంటే యశ్వంత్ సిన్హా పేరుతో తెలివిగా ఈ వేదికను ఉపయోగించుకొని ప్రధాని నరేంద్రమోడీని తూర్పారబట్టారని అర్దమవుతోంది.

సిఎం కేసీఆర్‌ తనకు ఈ స్థాయిలో ఘన స్వాగతం పలకడం చూసి బహుశః మురిసిపోయిన యశ్వంత్ సిన్హా, సభ ముగిసేసరికి తనను సిఎం కేసీఆర్‌ తెలివిగా వాడుకొన్నారని గ్రహించే ఉంటారు. కానీ ఇక చేసేదేమీ లేదు కనుక ప్రగతి భవన్‌కు వెళ్ళి భోజనం చేసి సిఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకొని బయలుదేరక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories