తెలంగాణ రాష్ట్రంలో గత రెండున్నర దశాబ్ధాల పాటు కేసీఆర్ శకం కొనసాగగా, ఇప్పుడు రేవంత్ రెడ్డి శకం నడుస్తోంది.
కేసీఆర్‌ని ఓడించడమే గొప్ప అనుకుంటే, బొటాబోటి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందనుకుంటే, దిగ్విజయంగా ఏడాది పాలన పూర్తి చేసుకోవడం ఇంకా గొప్ప విషయమే.
ఈ సందర్భంగా వరంగల్లో ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై ప్రజలు, రాజకీయ విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
“కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కూర్చొని నా ప్రభుత్వం కూల్చేందుకు ఇంకా కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నారో కూడా నాకు తెలుసు. ఎన్నికలలో ఆయనని ఓడిస్తానని చెప్పాను ఓడించాను. లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు రాకుండా చేస్తానని చెప్పాను. చేశాను.
ఇప్పుడు కేసీఆర్ అనే కలుపు మొక్కని మళ్ళీ తెలంగాణ గడ్డపై మొలకెత్తకుండా చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నాను,” అని రేవంత్ రెడ్డి అన్నారు.
గతంలో కేసీఆర్, జగన్ ఇద్దరూ ఇదేవిదంగా అహంభావంతో విర్రవీగుతూ రాష్ట్రంలో మరెవరూ అధికారంలోకి రాలేరని తామే మరో 20-30 ఏళ్ళు అధికారంలో ఉంటామని గొప్పగా చెప్పుకునేవారు. కానీ 5 ఏళ్ళకే జగన్, పదేళ్ళకు కేసీఆర్ ఇద్దరూ ఓడిపోయారు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి చెపుతున్న ఈ మాటలు కూడా అలాగే ఉన్నాయి. రాష్ట్రంలో ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉండబోతోందని చెపుతున్నారని అనుకోవచ్చు.
అధికారంలో ఉండాలని కోరుకోవడం తప్పు కాదు. ఎప్పటికీ తామే ఉంటామనుకోవడమే తప్పు! ఇంతవరకు ఎవరూ శాస్వితంగా ఉండలేకపోయారని తెలిసి కూడా ఈవిదంగా ప్రగల్భాలు పలికితే ఆ తర్వాత కేసీఆర్, జగన్‌లాగే రేవంత్ రెడ్డి కూడా నవ్వులపాలుకాక తప్పదు.
ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి, మళ్ళీ తానే ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే, రేవంత్ రెడ్డి ఆలోచనా ధోరణి, మాట తీరు, వ్యవహార శైలి, ప్రభుత్వ విధానాలు సమూలంగా మార్చుకోవలసి ఉంటుంది. అందుకు రేవంత్ రెడ్డి వద్ద మరో నాలుగేళ్ళ సమయం ఉంది కూడా.
కానీ నేను, నా ఆలోచనలు, విధానాలు అన్నీ అద్భుతంగా ఉన్నాయని అనుకుంటే, భవిష్యత్‌లో కేసీఆర్, జగన్ పక్కన రేవంత్ రెడ్డి కూడా కూర్చోక తప్పదు.




