గెలుపు కోసం రాజకీయ నాయకులు, అధికారం కోసం రాజకీయ పార్టీలు ఏ స్థాయి పోరాటానికైనా సై అంటూ ప్రత్యర్థి తో సవాల్ చేస్తాయి. అయితే గెలుపును ఎంజాయ్ చేస్తున్న ప్రతి రాజకీయ నాయకుడు ఓటమిని మాత్రం అంగీకరించలేకపోతున్నారు.
ఇది ముమ్మాటికీ ప్రజా స్వామ్యాన్ని అగౌరవపరచడం, రాజ్యాంగాన్ని కించపరచడమే అవుతుంది. గెలిచినా ఓడినా రాజకీయమే అనుకునేవారు గెలుపోటములను పడిలేచే కెరటాల మాదిరి భావించి ప్రజా తీర్పును గౌరవిస్తారు. అలాకాకుండా గెలుపును మాత్రమే ఆస్వాదిస్తాం అనుకునే వారి బలుపుని ప్రజలు ఎంతో కాలం స్వాగతించారు.
ఉదాహరణకు జగన్, కేసీఆర్ విషయమే తీసుకుంటే వీరు, వీరి పార్టీ ప్రజలు మద్దతు పొందినంత కాలం చట్ట సభలకు వెళ్లి ప్రత్యర్థి పార్టీల నేతలను అత్యంత హీనంగా కించపరిచారు. అలాగే వారి ప్రత్యర్థులు అసెంబ్లీలోకి అడుగుపెట్టలేనంతగా వారి పై వ్యక్తిగత దూషణలకు నాంది పలికారు.
2019 ఎన్నికలలో టీడీపీ ఓటమితో ప్రతిపక్షానికి పరిమితమైన బాబు, ఓటమిని బరువుగా కాకుండా బాధ్యతగా భావించి ప్రజా తీర్పును గౌరవించి అసెంబ్లీకి వెళ్లారు. అయితే అప్పుడు గెలిచిన అహంలో ఉన్న వైసీపీ బాబుని అన్నివిధాలా అగౌరవ పరుస్తూ మానసికంగా హింసించి చట్ట సభలకు రానివ్వకుండా చేసింది.
అలాగే 151 మంది ఎమ్మెల్యే లను వెంటేసుకుని జగన్ ఒక వీధి రౌడీ మాదిరి అసెంబ్లీలో తన ప్రత్యర్థుల మీద వ్యక్తిగత దూషణలకు తెగబడుతూ అసెంబ్లీని ఒక విహార యాత్ర మాదిరి ఎంజాయ్ చేసారు. ఇప్పుడు ఓటమి ఎదురవడంతో అదే అసెంబ్లీ గేటు తాకడానికి భయపడుతూ మీడియా ముందు కాలక్షేపం చేస్తున్నారు.
వైసీపీ గెలిచినప్పుడు ఊటీ లా జగన్ కు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందించిన ఏపీ అసెంబ్లీ ఓడినప్పుడు మాత్రం కాశ్మీర్ బోర్డర్ మాదిరి భయపెడుతుందా.? అలాగే రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉన్న కేసీఆర్ కూడా జగన్ మాదిరి పార్టీని ఓటమి పలుకరించగానే, ప్రతిపక్ష నేతగా మారగానే అధ్యక్ష అంటూ అసెంబ్లీకి వెళ్ళడానికి మొహం చాటేస్తున్నారు.
ప్రతిపక్షాలను కాలరాయాలనే పదేళ్ల అధికారం ఇప్పుడు అదే ప్రతిపక్ష హోదాతో కేసీఆర్ ను పలుకరించింది. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వకుండా సర్వ శక్తులు ఒడ్డారు తెరాస నేతలు. ఇప్పుడు అదే బిఆర్ఎస్ నాయకులు రేవంత్ ఎదుట పడలేక అసెంబ్లీకి రావడానికి జంకుతున్నారు.
దీనితో ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులను ఉద్దేశించి ప్రజాస్వామ్య వాదులు, రాజకీయ విశ్లేషకులు కొన్ని ప్రశ్నలను సంధిస్తున్నారు.మీకు గెలుపు మాత్రమే బాధ్యతను గుర్తు చేస్తుందా.? ఓటమి భయాన్నే చూపిస్తుందా.?
గెలిస్తే అసెంబ్లీకి వచ్చి అధ్యక్షా అంటూ ప్రత్యర్థి పార్టీ నేతలను అవమానిస్తూ అసెంబ్లీని ఊటీ మాదిరి ఎంజాయ్ చేసిన జగన్, కేసీఆర్ ఓటమితో అధ్యక్షా అంటూ అదే ప్రత్యర్థులతో పోరాడలేక అసెంబ్లీని చూసి పాకిస్తాన్ బోర్డర్ లో ఉన్న కాశ్మీర్ మాదిరి భయపడుతున్నారా.? అనేదానికి ఈ ఇద్దరు నేతలు ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి.




