ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ ఎన్నికలలో ఓడిపోతే ఏదో రోజు జైలుకి వెళ్ళక తప్పదని అందరికీ తెలుసు. అయితే అది వారి స్వయంకృతమే అని చెప్పక తప్పదు.
కేసీఆర్ విషయానికి వస్తే ఆయన రేవంత్ రెడ్డిని ఓటుకి నోటు కేసులో జైలుకి పంపించి, ఆయన కూతురు పెళ్ళిలో చాలా దారుణంగా అవమానించారు.
కనుక ఏనాటికైనా కేసీఆర్‌ని జైలుకి పంపించి చిప్పకూడు తినిపిస్తానని అప్పుడే రేవంత్ రెడ్డి శపధం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే కేసీఆర్‌ని జైలుకి పంపేందుకు ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోలు ఒప్పందం కేసులతో సహా మరో అర డజను కేసులు సిద్దం చేస్తున్నారు. కనుక వాటిలో ఏదో ఓ కేసులో కేసీఆర్‌ని జైలుకి పంపించడం ఖాయమే అని భావించవచ్చు.
ఇక జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే 5 ఏళ్ళ పాలనలో రాజకీయ కక్ష సాధింపులతోనే గడిపేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుని అక్రమ కేసులో జైల్లో పెట్టించారు. ఎంపీ అని కూడా చూడకుండా రఘురామ కృష్ణరాజుపై రాజద్రోహం కేసు నమోదు చేసి అరికాళ్లు వాచిపోయేలా కొట్టించారు. ఇప్పుడు రఘురామ కృష్ణరాజు పిర్యాదుతో జగన్‌పై తొలి కేసు నమోదు అయ్యింది.
గత 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్… వారి పార్టీలు ప్రజాస్వామ్యబద్దంగానే జగన్ ప్రభుత్వంతో పోరాడుతుండేవి. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్‌కు వారి విమర్శల వలన రాజకీయంగా కాస్త ఇబ్బంది కలిగి ఉండవచ్చు తప్పితే ప్రభుత్వానికి ఎటువంటి సమస్య లేదు. అయినా జగన్ టిడిపి నేతలను వెంటాడి, వేదించారు. చంద్రబాబుతో సహా టిడిపిలో ప్రతీ ఒక్కరినీ జైలుకి పంపి శాస్వితంగా అడ్డు తొలగించుకోవాలని విశ్వప్రయత్నాలు చేశారు.
అప్పుడు వారి పట్ల అంత దుర్మార్గంగా ప్రవర్తించడాన్ని జగన్ తప్పుగా అనుకోలేదు. వాటి పర్యవసనాల గురించి కూడా ఆలోచించలేదు. కనుక ఇప్పుడు ఈ కేసులు జగన్ స్వయంకృతాపరాదమే అని చెప్పక తప్పదు.
టిడిపి కూటమి ప్రభుత్వం జగన్‌పై తొలి కేసు నమోదు చేయగానే రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని గగ్గోలు పెట్టేస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో పోలీసులు దొంగలని చిన్న దెబ్బ కొట్టినా వారు పెద్దగా అరుస్తూ బాధ నటిస్తుంటారు.
ఆవిదంగా చేస్తే మరిన్ని దెబ్బలు పడకుండా తప్పించుకోవచ్చని ఆశ పడుతుంటారు. వైసీపి తీరు కూడా సరిగ్గా అలాగే ఉంది. కానీ పెద్దగా అరిచి గగ్గోలు పెట్టేసినంత మాత్రాన్న చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోకుండా తప్పించుకోలేరు కదా?
నిజానికి జగన్‌పై ఈ కేసు చాలా చిన్నదే. అసలు కేసులు ముందున్నాయి. కనుక వాటి కోసం జగన్‌తో సహా వైసీపి నేతలు అందరూ సిద్దంగా ఉండక తప్పదు. తప్పుడు ఆలోచనలు చేసే నేతలను నమ్ముకున్న ఎవరికైనా ఇటువంటి బాధలు తప్పవు కదా?




