చంద్రబాబుని చూసి నేర్చుకో కేసీఆర్‌!

KCR-Chandrababu-Naidu

జగన్, కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుని ఎంతగా అవహేళన చేశారో అందరికీ తెలుసు. కేసీఆర్‌ తెలివితేటలు, రాజకీయ చాణక్యం ముందు చంద్రబాబు నాయుడు ఎందుకూ పనికిరారన్నట్లు మాట్లాడుతుండేవారు. జగన్‌ కూడా చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని, ఎన్నికల తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటారని పదేపదే చెప్పేవారు.

ADVERTISEMENT

కానీ అలా గొప్పలు చెప్పుకున్న జగన్, కేసీఆర్‌ ఇద్దరి పరిస్థితి ఇప్పుడు ఎంత దయనీయంగా మారిందో అందరూ చూస్తూనే ఉన్నారు.

అంతేకాదు… ఇప్పుడు తెలంగాణలోనే పలువురు నేతలు చంద్రబాబు నాయుడుని ప్రశంశిస్తూ, ఆయన ముందు కేసీఆర్‌ దిగదుడుపే అని చెపుతున్నారు కూడా.

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడుకి ఎన్ని కష్టాలు వచ్చినా కోర్ రాజకీయాలు విడిచిపెట్టకుండా జగన్‌ ప్రభుత్వంతో పోరాడుతూ మళ్ళీ అధికారంలోకి వచ్చారు. కానీ కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో కూర్చొని రాజకీయాలు చేస్తూ నా ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారం చేజిక్కించుకోవాలని కుట్రలు చేస్తున్నారు. అలాంటి దురాలోచనలు మానుకొని కేసీఆర్‌ కూడా చంద్రబాబు నాయుడులా ప్రజల మద్యకు వెళ్ళి ప్రజాసమస్యలపై పోరాడితే మంచిది,” అని అన్నారు.

ఇటీవల బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌ నిన్న హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడులాగ కేసీఆర్‌ ఏనాడూ ఎమ్మెల్యేలను గౌరవించలేదు. కేసీఆర్‌, కేటీఆర్‌ ఇద్దరూ కూడా ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారు. మాకు అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదు. ఇచ్చినా గంటల తరబడి ఎదురు చూసేలా చేసేవారు.

గత 5 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు అనేక రాజకీయ వేధింపులు, ఒత్తిళ్ళు భరిస్తూ 5 ఏళ్ళపాటు తన పార్టీని, ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగారు. మళ్ళీ అధికారంలోకి రాగలిగారు. కానీ కేసీఆర్‌ ఆరు నెలలు తన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కాపాడుకోలేకపోతున్నారు.

కేసీఆర్‌ నాయకత్వంపై నమ్మకం లేకనే బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు బయటకు వచ్చేస్తుంటే కేసీఆర్‌ వారిని చేజారిపోకుండా కాపాడుకోలేక కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. ఇప్పటికైనా ఆయన చంద్రబాబు నాయుడుని చూసి నేర్చుకుంటే మంచిది,” అని దానం నాగేందర్‌ అన్నారు.

చివరికి కేటీఆర్‌ కూడా చంద్రబాబు నాయుడు ఏవిదంగా కేంద్రం నుంచి నిధులు రాబట్టుకొంటున్నారో చూడండి అంటూ ‘బ్లూమ్ బెర్గ్ రిపోర్ట్’ ను టాగ్ చేస్తూ ట్వీట్‌ చేశారు.

కేసీఆర్‌ కంటే చంద్రబాబు నాయుడు చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు. చంద్రబాబు నాయుడుని జగన్‌ ప్రభుత్వం జైల్లో పెట్టించినా నిబ్బరం కోల్పోలేదు. పార్టీ విచ్చినమైపోకుండా కాపాడుకుంటూ మళ్ళీ అధికారంలోకి వచ్చారు. టిడిపి ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా ఆయనపై పూర్తి నమ్మకంతో చంద్రబాబు నాయుడు వెంట నడిచారు.

కేసీఆర్‌పై రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నుంచి పెద్దగా ఒత్తిడీ లేనప్పటికీ తన ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతున్నారు. ఒకే ఒక్క ఓటమితో ఆరు నెలల్లోనే బిఆర్ఎస్‌ పార్టీ సగం ఖాళీ అయిపోయింది.

మోడీని గద్దె దించి తాను ఆ కుర్చీలో కూర్చొని దేశాన్ని ఏలుతానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్‌, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నాలుగు నెలలుగా తిహార్ జైల్లో ఉంటున్న కూతురు కల్వకుంట్ల కవితని కూడా విడిపించుకోలేకపోతున్నారు. కూతురినే కాపాడుకోలేని కేసీఆర్‌, మమ్మల్ని ఏం కాపాడుతారంటూ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు.

కేసీఆర్‌, జగన్‌లాగ చంద్రబాబు నాయుడు ఏనాడూ ప్రగల్భాలు పలుకలేదు. తనను ఈసడించుకుంటున్నవారిపై ఎదురుదాడి చేయలేదు. కానీ నిబ్బరంగా పోరాడుతూ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చారు. కేంద్రంలో కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఈ నేపధ్యంలో కేసీఆర్‌, చంద్రబాబు నాయుడు నాయకత్వ లక్షణాలు, పోరాట స్పూర్తి, అనుసరిస్తున్న రాజకీయ విధానాలను బేరీజు వేసుకొని చూసిన్నట్లయితే, చంద్రబాబు నాయుడు ముందు కేసీఆర్‌ దిగదుడుపే అనిపించకమానదు.

ADVERTISEMENT
Latest Stories