జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి కేసీఆర్ పంచన చేరుతున్నారు. కనుక గులాబీ రంగు కళ్ళద్దాలు పెట్టుకొని, 40 ఏళ్ళు పని చేసిన కాంగ్రెస్ పార్టీని, సిఎం రేవంత్ రెడ్డిని చూస్తుంటే ఆయనకి విలన్లుగా కనిపిస్తున్నారు.
గులాబీ పాటలో అతి ముఖ్యమైనది చంద్రబాబు నాయుడు బూచి పాట కూడా ఒకటి. కనుక ఆ పాట కూడా పాడేసి గులాబీ కండువాకి ప్రాధమిక అర్హత సాధించారు.
మొన్న కేసీఆర్‌ని ఫామ్‌హౌసులో కలిసి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు కనుసన్నలలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకే కాళేశ్వరం ప్రాజెక్టుని పాడుబెట్టేశారు. అయన ఆదేశం మేరకే గోదావరి నీటిని ఏపీకి విదిచిపెడుతున్నారు. చంద్రబాబు నాయుడు మాటలు విని తెలంగాణ రాష్ట్రానికి, రైతులకు అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డిని వచ్చే ఎన్నికలలో ప్రజలు గద్దె దించేయడం, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవడం రెండూ ఖాయమే,” అని జీవన్ రెడ్డి అన్నారు.
చంద్రబాబు నాయుడు బూచి పాటతో జీవన్ రెడ్డి గులాబీ కండువాకి ప్రాధమిక అర్హత సంపాదించుకున్నారు కనుక ఈ నెల 27న జరుగబోయే బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సభలో మెడలో గులాబీ కండువా పడితే ఇక జీవన్ రెడ్డికి కూడా లోకమంతా గులాబీ రంగులోనే కనిపిస్తుంది.
కానీ ఈటల రాజేందర్, విజయశాంతి, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ వంటివారిని, చివరికి కన్న కూతురు కల్వకుంట్ల కవితని కూడా అవమానించిన కేసీఆర్, ఏదో రోజు జీవన్ రెడ్డిని కూడా అవమానింఛికుండా ఉంటారా? అప్పుడీ గులాబీ నిషా దిగిపోకుండా ఉంటుందా? అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.




