ఆంధ్రా పేరుతో తెలంగాణలో రాజకీయాలు… ఇదేం ఖర్మ!

KCR Revanth Reddy Palamuru project clash

ఇంతకాలం తెలంగాణలో మూడు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేసుకునేవి. బిజేపితో బీఆర్ఎస్‌ కుమ్మక్కు, కాంగ్రెస్‌తో బీఆర్ఎస్‌ కుమ్మక్కు, కాంగ్రెస్‌, బిజేపిలు కుమ్మక్కు అంటూ మూడు పార్టీలు వాదించుకునేవి. కానీ ఇప్పుడు అందరూ కలిసి ఏపీ మీద పడ్డారు.

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కు అయ్యారని బీఆర్ఎస్‌ పార్టీ వాదిస్తుంటే, మాజీ సిఎంలు కేసీఆర్‌, జగన్‌ కుమ్మక్కయ్యారని కాంగ్రెస్‌ పార్టీ వాదిస్తోంది.

ADVERTISEMENT

కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు హటాత్తుగా ఆంధ్రా మీద ఎందుకు పడ్డాయంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు గురించి.

కేసీఆర్‌ ఇటీవల ఫామ్‌హౌసులో నుంచి బయటకు వచ్చి, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ నీళ్ళు ఆంధ్రాకు దోచిపెట్టడానికే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇలా చేస్తోందని కేసీఆర్‌ ఆరోపించారు.

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకి తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి తొత్తులా మారి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ పాలకులతో కుమ్మక్కయ్యి కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని కేసీఆర్‌ హెచ్చరించారు.

త్వరలోనే ఈ ప్రాజెక్టు కోసం మహబూబ్‌నగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి, నీళ్ళ కోసం మరోసారి ఉద్యమం చేపడతామని కేసీఆర్‌ హెచ్చరించారు.

పదేళ్ళు సిఎంగా చేసిన కేసీఆర్‌ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిచేయకుండా రెండు జిల్లాల ప్రజలకు తీరని అన్యాయం చేశారని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా ఇప్పుడు మొసలి కన్నీళ్ళు కార్చుతున్నారని ఆరోపించారు.

నాడు కేసీఆర్‌ జగన్‌తో కుమ్మక్కయినందునే ఈ ప్రాజెక్ట్ పక్కన పడేసి కమీషన్ల కోసం కాళేశ్వరం మొదలుపెట్టారని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే మళ్ళీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ప్రారంభించామన్నారు.

కేసీఆర్‌ రెండేళ్ళుగా ఫామ్‌హౌసులో కాలక్షేపం చేసినప్పుడు ఆయనకు ఈ ప్రాజెక్టు గుర్తు రాలేదు. ప్రజలు, రైతుల సమస్యలని పట్టించుకోలేదు.

నానాటికీ బలహీనపడుతున్న బీఆర్ఎస్‌ పార్టీని కాపాడుకోవాలంటే తెలంగాణ సెంటిమెంట్ రగిలించడానికి ఈ ప్రాజెక్ట్ అన్ని విధాల సరిపోతుందని భావించారు. అందుకే ఇప్పుడు హటాత్తుగా దీనిని భుజానికెత్తుకొని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో ముడిపెట్టి మాట్లాడుతున్నారని అర్ధమవుతూనే ఉంది.

ఈ ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్‌ పార్టీ రాజకీయ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా గ్రహించింది. కనుక కేసీఆర్‌, జగన్‌ కుమ్మక్కయ్యారంటూ ఎదురుదాడి చేస్తోంది.

వాస్తవానికి వాటి మద్య జరుగుతున్నది రాజకీయ ఆధిపత్యపోరు. దానికి ఈ ప్రాజెక్టు ఓ వేదిక. ఆ వేదికపైకి కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ నేతలు ముఖాముఖి యుద్ధం చేసుకోకుండా ఒకరు చంద్రబాబు నాయుడు, మరొకరు జగన్‌ భజన చేస్తుండటం విడ్డూరంగా ఉంది.

తెలంగాణ ఏర్పడిన 11 ఏళ్ళ తర్వాత కూడా నేటికీ చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకోకుండా కేసీఆర్‌ రాజకీయాలు చేయలేకపోతున్నారు. అది బీఆర్ఎస్‌ పార్టీకి బలం కావచ్చు కానీ అదే దాని దౌర్భాగ్యం కూడా!

బీఆర్ఎస్‌ పార్టీ నీళ్ళ పేరుతో రాజకీయాలు చేస్తుంటే, దానికి చెక్ పెట్టాల్సిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అయన సృష్టించిన ఈ మురికి రాజకీయ ప్రవాహంలో కొట్టుకుపోతోంది.

అసెంబ్లీకి ప్రభుత్వం అజెండా నిర్ణయించాలి. కానీ కేసీఆర్‌ నిర్ణయిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫాలో అవుతోంది. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది?

ADVERTISEMENT
Latest Stories