ఈ విషయంలో కేసీఆర్‌ని ఆదర్శంగా తీసుకోవాలసిందే!

KCR Should be Taken As Role Model

ఏటా వర్షాకాలం మొదలయ్యే ముందు అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు మొక్కలు నాటే కార్యక్రమాలు మొదలుపెడుతుంటాయి. అలాగే ఆంధ్రాలో సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

పర్యావరణాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వారి వారి జిల్లాలు, నియోజకవర్గాలలో వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

ADVERTISEMENT

కానీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఇదో ‘తంతు’గా మాత్రమే భావిస్తుండటం వలన సభలు, సందేశాలు, ఫోటోలతోనే ముగిసిపోతోంది తప్ప రాష్ట్రంలో పచ్చదనం పెరగడం లేదనేది చేదు వాస్తవం.

పచ్చదనం-పర్యావరణం గురించి చెప్పుకోవాలంటే తప్పనిసరిగా కేసీఆర్‌, జగన్‌ గురించి చెప్పుకోకతప్పదు. అలాగే పద్మశ్రీ వనజీవి రామయ్య గురించి కూడా రెండు ముక్కలు చెప్పుకోక తప్పదు.

కేసీఆర్‌ రాజకీయాలు, నిరంకుశ ధోరణి ఎలా ఉన్నప్పటికీ తన హయంలో మొక్కలు నాటడం ఓ ఉద్యమంలా చేపట్టి తెలంగాణలో పచ్చదనం చాలా పెంచారు.

హైదరాబాద్‌ నగరంతో సహా రాష్ట్రంలో అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలలో కూడా అర్బన్ ఫారెస్టులు పెంచారు. మారుమూల జిల్లాలు, గ్రామాలలో సైతం మొక్కలు నాటించి పచ్చదనం పెంచారు.

కోతులు వంటి అడవి జంతువులకు, పక్షులకు నీడ, ఆహారం అందించే చెట్లను పెంచి వన్య ప్రాణులకు కూడా మహోపకారం చేశారు.

నిరుపేద కుటుంబానికి చెందిన వనజీవి రామయ్య ఖమ్మం జిల్లాలో కోటి మొక్కలు స్వయంగా నాటి అవి చెట్లుగా పెరిగే వరకు ఎంతో శ్రమించి సంరక్షించారు. అందుకే ఆయనని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సన్మానించింది. ఇటీవలే ఆయన అనారోగ్యంతో మృతి చెందారు.

జగన్‌ నాటిని మొక్కల కంటే నరికించిన చెట్లే ఎక్కువని అందరికీ తెలుసు. జగన్‌ ప్రాణ భయం కారణంగా ఆయన ఎక్కడ సభ నిర్వహిస్తే ఆ చుట్టు పక్కల ప్రాంతాలలో పచ్చటి చెట్లన్నీ నరికించేసేవారు. ఆవిదంగా జగన్‌ 5 ఏళ్ళ పాలనలో రాష్ట్రంలో ఎన్ని వేల చెట్లు నరికించారో లెక్కలేదు.

విశాఖలో పచ్చటి చెట్లతో నిండిన రుషికొండపై ప్యాలస్‌లు నిర్మించుకునేందుకు బోడి గుండులా చెక్కించేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తుండటంతో అందరినీ మభ్యపెట్టేందుకు కొండపై పచ్చటి తివాచీ పరిపించారు.

కేసీఆర్‌ 10 ఏళ్ళపాటు ఓ మహా యజ్ఞంలా చెట్లు నాటించి తెలంగాణ రాష్ట్రానికి పచ్చదనం కానుకగా ఇస్తే, జగన్‌ 5 ఏళ్ళ పాలనలో వేలాది పచ్చటి చెట్లు నిర్ధాక్షిణ్యంగా నరికించేసి పర్యావరణానికి కూడా తీరని అపకారం చేశారు.

కనుక ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు, ముఖ్యంగా ప్రకృతి ప్రేమికుడు పవన్ కళ్యాణ్‌ ఇద్దరూ రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదికన చెట్లు పెంచే కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది మొదలుపెట్టిన ఈ వనమహోత్సవంతో వచ్చే ఏడాదినాటికి రాష్ట్రంలో పచ్చదనం కనీసం 5-10 శాతం పెంచగలగాలి. అలా కాకుండా కేవలం సభలు, ప్రతిజ్ఞలు, ఫోటోలతో సరిపెట్టేస్తే రుషికొండపై జగన్‌ పచ్చటి తివాచీ పరిచి మభ్య పెడుతున్నట్లే భావించాల్సి ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories