కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతగా అభివృద్ధి చేసినప్పటికీ ఆయన అహంభావం కారణంగానే బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని తెలంగాణ ప్రజలు చెప్పుకొంటున్నారు. ఏపీలో ఎవరిని అడిగినా ఇదే చెపుతున్నారు. కేసీఆర్ అహంకారానికి బిఆర్ఎస్ పార్టీ, దాని నేతలు, కార్యకర్తలు మూల్యం చెల్లించారన్న మాట! అంటే నాయకుడి అహంకారం పార్టీకి చేటు అని స్పష్టమవుతోంది.
తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేసినప్పటికీ ప్రజలు కేసీఆర్ ఆహాన్ని సహించలేకపోయారు. మరి అభివృద్ధిని విస్మరించి సంక్షేమ పధకాలనే అభివృద్ధిగా చెప్పుకొంటున్న ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే వ్యవహరిస్తుంటే ప్రజలు సహిస్తారా?
సంక్షేమ పధకాల పేరుతో లక్షల కోట్లు పంచిపెట్టేస్తున్నా లబ్ధిదారులందరూ ఖచ్చితంగా వైసీపికే ఓట్లు వేస్తారనే నమ్మకం లేనందునే సామాజిక సాధికార యాత్రలు చేయించాల్సి వచ్చింది.
నిన్న పోలిపల్లిలో టిడిపి, జనసేనల సభకు దూర ప్రాంతాల నుంచి రైళ్ళు, బస్సులలో వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. కానీ వైసీపి నేతల బస్సు యాత్రలకు జనసమీకరణ చేయాల్సివస్తోంది. చేసినా కుర్చీలు నిండటం లేదు.
చివరికి జగన్ బటన్ నొక్కుడు సభలకు కూడా బలవంతంగా జనసమీకరణ చేయాల్సివస్తోంది. టిడిపి, జనసేనల సభలకు, ఆ పార్టీ అగ్రనేతల రోడ్ షోలకు కూడా జనాలు స్వచ్చందంగా తరలివస్తున్నారు. కానీ మన సభలకు రావడం లేదు. ఎందువల్ల?అని వైసీపి నేతలు ఎవరూ ఆలోచిస్తున్నట్లు లేదు. ప్రజలు మార్పు కోరుకొంటున్నారని ఇది సూచిస్తోంది. బహుశః జగన్మోహన్ రెడ్డి కూడా ఇది గ్రహించే ఉంటారు.
కానీ జగన్ నేటికీ కేసీఆర్‌లాగే ఆలోచిస్తున్నారు. వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు. కేసీఆర్‌లాగే వ్యూహాలు మార్చుకొని ఎన్నికలలో గెలిచేయవచ్చని జగన్ భావిస్తున్నట్లున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిల మార్పు అటువంటి ప్రయత్నమే అనుకోవచ్చు.
కానీ ప్రభుత్వాన్ని మార్చేయాలని ఒకసారి ప్రజలు నిర్ణయించుకొన్న తర్వాత కేసీఆర్ అంతటి మొనగాడు కూడా గెలవలేడని స్పష్టమైనప్పుడు, తాను మాత్రం 175 సీట్లు గెలుచుకొంటామని జగన్ చెప్పుకొంటున్నారు. అదే చాలా విచిత్రం.
కేసీఆర్, కేటీఆర్ కూడా ‘మనమే గెలుస్తాము… మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని’ పార్టీ శ్రేణులకు చివరి నిమిషం వరకు మభ్యపెట్టారు. బహుశః జగన్ కూడా అదే చేస్తున్నట్లున్నారు.
అయితే కేసీఆర్ తన మంత్రులు, ఎమ్మెల్యేలను పూర్తిగా నమ్మారు. మళ్ళీ వారికే సీట్లు ఇచ్చారు. కానీ జగన్ తన మంత్రులు, ఎమ్మెల్యేలను నమ్మడం లేదని తాజా మార్పులు చేర్పులతో తేలిపోయింది. కనుక వైసీపి నేతలు ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ భజన చేసుకొంటూ కాలక్షేపం చేస్తుంటే చివరికి చేతిలో ఆ చిడతలే మిగులుతాయేమో?




