టిడిపి సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని ఊహించిన్నట్లే చంద్రబాబు నాయుడు ఆయనకు టికెట్ నిరాకరించారు. ఈ విషయం ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేశారు.
చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు గురువారం సాయంత్రం మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధ్యక్షుడు నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ వచ్చి ఈసారి నాకు టికెట్ ఇవ్వలేనని తెలియజేశారని చెప్పారు.
ఈ నెల 7న తిరువురులో జరుగబోయే సభలో నియోజకవర్గానికి వేరేవారిని ఇన్‌చార్జిగా నియమించబోతున్నట్లు ప్రకటిస్తారని కనుక నన్ను సంయమనంతో వ్యవహరించాలని చంద్రబాబు నాయుడు కోరిన్నట్లు వారు చెప్పారు. పార్టీ వ్యవహారాలలో ఎక్కువ జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నాకు మళ్ళీ టికెట్ ఇవ్వకపోయినా నేను చంద్రబాబు నాయుడు ఆదేశానికి కట్టుబడి ఉంటాను,” అని కేశినేని నాని చెప్పారు.
సోదరుడు కేశినేని చిన్నితో తలెత్తిన విభేధాల కారణంగా కేశినేని నాని కొంతకాలం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి దూరంగా ఉన్నారు. కానీ ఆ తర్వాత తన వైఖరి మార్చుకొని స్వయంగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ, చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని గట్టిగా సమర్ధించారు. మళ్ళీ తనకు తప్పకుండా టికెట్ లభిస్తుందనే నమ్మకంతోనే కేశినేని నియోజకవర్గంలో యధాప్రకారం కార్యక్రమాలు చేసుకుంటున్నారు.
అయితే నిన్న పార్టీ కార్యాలయం వద్ద ఇన్‌చార్జి దేవదత్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కేశినేని నాని ఫోటో లేకపోవడంతో కేశినేని అనుచరులు చాలా గొడవ చేశారు. ఈ విషయం చంద్రబాబు నాయుడు దృష్టికి రావడంతో వెంటనే అప్రమత్తమై కేశినేని నానిని హెచ్చరించారు.
ఈసారి శాసనసభ ఎన్నికలలో టిడిపి, జనసేనలకు విజయావకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కనుక చంద్రబాబు నాయుడు సూచించిన్నట్లు కేశినేని నాని సంయమనం పాటిస్తూ తన అనుచరులను కట్టడి చేస్తే ఆయనకే మంచిది. ఎందుకంటే టిడిపి ప్రతిపక్షంలో వెంట నడిచి, అధికారంలోకి వస్తున్నప్పుడు దూరం అయితే ఆయనే నష్టపోతారు కదా!




