జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనని మెప్పించడానికి లేదా తాము ఆయనకు నమ్మకస్తులమని నిరూపించుకుని పదవులు సంపాదించుకునేందుకు వైసీపిలో కొందరు నేతలు పోటాపోటీగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లను అవహేళన చేసేవారు.
మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పల్రాజు, ఎంపీ విజయసాయి రెడ్డివంటి వారు ఇంకా చాలా మందే ఆ జాబితాలో ఉన్నారు. వైసీపి సోషల్ మీడియా… అదో పెద్ద బ్యాచ్… పెద్ద కధలే ఉన్నాయి.
ఆ జాబితాలో నెంబర్ స్థానంలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఉండగా, గన్నవరంలో టిడిపి కార్యాలయంపై దాడి చేసి, టిడిపి నేతల వాహనాలను తగులబెట్టించి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జగన్ వద్ద ఎక్కువ మార్కులు సంపాదించుకున్నారు.
ఇప్పటికే ఆ కేసులో పలువురు అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో నలుగురు అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఇళ్ళ పట్టాల కేసులో వల్లభనేని వంశీ డిసెంబర్‌లో కోర్టు విచారణకు హాజరుకావలసి ఉంది. అప్పుడు ఆయనని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
శాసనసభలో అందరి ముందు చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి పట్ల చాలా అనుచితంగా మాట్లాడిన గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై ఇటీవలే విశాఖ పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు నమోదు అయ్యింది. కొడాలి నాని తమకి చాలా బాకీ ఉన్నారని టిడిపి నేతలందరూ ముక్త కంఠంతో చెపుతుంటారు. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్!
కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. గున్నమామిడీ కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి… అన్నట్లు కనుక కూటమి ప్రభుత్వం వారిద్దరికీ జైల్లో కూడా గూళ్ళు రిజర్వ్ చేసి పెట్టే ఉంచింది. కానీ ఇద్దరిలో ఎవరు ముందు ఎవరు వెనుక? అనేది మాత్రమే ఇంకా తేలాల్సి ఉంది.




