తెలంగాణ బిజెపి సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాజకీయాలు, బిజెపి పరిస్థితి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. “తెలంగాణలో బిజెపి చాలా బలంగానే ఉంది కానీ బిజెపి-బిఆర్ఎస్ పార్టీల మద్య రహస్య అవగాహన ఉందనే కాంగ్రెస్ ప్రచారంతో ప్రజలలో విశ్వసనీయత కోల్పోతున్నాము. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అవుతారని రాష్ట్ర బిజెపి నేతలు చెప్పుకొన్నారు. కానీ ఇంతవరకు ఆమెను అరెస్ట్ చేయకుండా ఉపేక్షిస్తుండటంతో మా రెండు పార్టీలకిమద్య ఏదో రహస్య అవగాహన ఉందనే భావన ప్రజలలో కూడా నెలకొంది. దానికి తోడు కాంగ్రెస్ నేతలు కూడా మా రెండు పార్టీల మద్య ఢిల్లీ స్థాయిలో అవగాహన ఉందని ప్రచారం చేస్తున్నారు. బిజెపి గురించి ప్రజలలో ఇటువంటి భావనలు ఉన్నప్పుడు ఎంత ప్రయత్నించినా తెలంగాణలో బలపడలేము. తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావాలని కోరుకొంటున్నట్లయితే బిఆర్ఎస్తో బిజెపికి ఎటువంటి రహస్య అవగాహన లేదని నిరూపించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవితని వెంటనే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది,” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో బిజెపి పరిస్థితి గురించి మాట్లాడుతూ, “కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాడే శక్తులు, ఆయన కుటుంబాన్ని గద్దె దించాలనుకొనేవారు తెలంగాణలో చాలామంది ఉన్నారు. వారందరినీ బిజెపిలో చేర్చుకొని పోరాడితే కేసీఆర్‌ను గద్దె దించడం పెద్ద కష్టం కాదు. కానీ బిఆర్ఎస్తో బిజెపికి రహస్య అవగాహన ఉండేనే కారణంగానే ఇతర పార్టీల నేతలెవరూ బిజెపిలో చేరేందుకు ఆసక్తి చూపడంలేదు. అలాగని కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టినా దానిని కేసీఆర్ పురిటిలోనే చంపేస్తారు. కేసీఆర్‌ను గద్దె దించగల ఏకైక పార్టీ బిజెపి మాత్రమే అని ప్రజలు కూడా నమ్మారు. కానీ కేసీఆర్ కుటుంబం పట్ల బిజెపి మెతక వైఖరి కారణంగా ప్రజలలో ఆ నమ్మకం సన్నగిల్లిపోతోంది. కనుక ప్రజలకు, కేసీఆర్‌ని వ్యతిరేకించేవారికి బిజెపి అధిష్టానం నమ్మకం కలిగించాలి. అప్పుడే కేసీఆర్ వ్యతిరేక శక్తులు బిజెపిలోకి వస్తారు. అప్పుడే తెలంగాణ ఎన్నికలలో బిజెపి గెలిచి అధికారంలోకి రాగలుగుతుంది,” అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.
గత వారం రోజులుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు తెలంగాణ బిజెపి నేతలను ఢిల్లీకి పిలిపించుకొని వేర్వేరుగా మాట్లాడుతున్నారు. వారు తమ అధిష్టానానికి ఏమి చెపుతున్నారో కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాటలతో స్పష్టమవుతోంది. కనుక త్వరలోనే కల్వకుంట్ల కవిత కేసులో మళ్ళీ కదలిక రావచ్చు. అలాగే తెలంగాణ బిజెపి పగ్గాలు కూడా ఈటల రాజేందర్ లేదా వేరే వారికి అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఇవే కనుక జరిగితే తెలంగాణలో మళ్ళీ రాజకీయాలు ఊహించని స్థాయిలో వేడెక్కుతాయి.



