ఇదివరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో భారీగా అవినీతి జరిగిందంటూ జగన్ ప్రభుత్వం ఆయనని అరెస్ట్ చేసి సుమారు రెండు నెలలు జైల్లో పెట్టింది. కర్ణుడు చావుకి వంద కారణాలన్నట్లు ఎన్నికలలో జగన్ ఓటమికి ఇది కూడా ఓ కారణమైంది.
చంద్రబాబు నాయుడుని ఏదో విదంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టామనే జగన్, వైసీపి నేతలు తృప్తి, సంతోషపడటం తప్ప ఆ కేసులో వాస్తవం లేదని మాజీ ఐఎస్ఎస్ అధికారి పీవీ రమేష్ తాజా వివరణతో బయటపడింది.
ఆనాడు స్కిల్ డెవలప్‌మెంట్, సీఐడీ, సీఎంఓలో ఒకేసారి కొన్ని ముఖ్యమైన ఫైళ్ళు మాయం అయ్యాయని, సీఎంవో పెద్దల ప్రమేయం లేకుండా ఇలా జరగడం అసంభవమని చెప్పారు. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసేందుకు ఫైళ్ళు మాయం చేసి ఉండొచ్చన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగిందని తాను ఎన్నడూ చెప్పలేదని కానీ తన వాంగ్మూలాన్ని మార్చేసి, ఫైళ్ళు మాయం చేసి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారని పీవీ రమేష్ అన్నారు. కనుక అప్పుడే తాను డిజిపికి లేఖ వ్రాసి ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరపాలని కోరానని పీవీ రమేష్ చెప్పారు.
టిడిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేడు శాసనసభలో ఇదే విషయం ప్రస్తావిస్తూ, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేందుకు జగన్ ప్రభుత్వం చేసిన ఈ కుట్రపై సభలో చర్చించి, తగు నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కుట్రపై తక్షణం విచారణ జరిపించాల్సిందిగా డీజీపీని ఆదేశించాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు.
నేడు శాసనసభ సమావేశాలను నిర్వహిస్తున్న ఉప సభాపతి రఘురామ కృష్ణరాజు ఈ అభ్యర్ధనపై సానుకూలంగా స్పందించారు. కానీ ఈ అంశంపై తర్వాత వేరేగా చర్చిద్దామని జీరో అవర్ కార్యక్రమం చేపట్టారు.
అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసేందుకు అక్రమ కేసు సృష్టించడం, తప్పుడు సమాచారంతో ఏసీబీ కోర్టుని తప్పు దారి పట్టించడం, ఈ కేసుని సృష్టించడం కోసం అత్యంత భద్రత కలిగిన స్కిల్ డెవలప్‌మెంట్, సీఐడీ, సీఎంఓలో కార్యాలయాల నుంచి ముఖ్యమైన ఫైళ్ళు మాయం చేయడం అన్నీ చాలా తీవ్రమైన నేరాలే.
ఇప్పుడు ఈ వ్యవహారం అంతా శాసనసభ వరకు వచ్చేసింది కనుక ఇకనైనా కూటమి ప్రభుత్వం దీనిపై విచారణ జరిపించి దీని వెనుక ఉన్న వైసీపి పెద్దలపై చర్యలు తీసుకుంటుందా? లేదా శాసనసభలో, బయట, మీడియాలో గొంతు చించుకుంటూ కాలక్షేపం చేస్తుందా? అనేది తేలాలి.




