KTR About Free Delimitation At All Party Meet In Chennai

తెలంగాణలో అధికార కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీ పరస్పరం కత్తులు దూసుకుంటుంటాయి. కేటీఆర్‌, హరీష్ రావులు నిత్యం సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చాలా చులకనగా మాట్లాడుతూనే ఉంటారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పాలనపై విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. వారికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌ మంత్రులు కూడా ఘాటుగా బదులిస్తుంటారు.

ఉప్పునిప్పుగా ఉండే అటువంటి బద్ధశత్రువులిద్దరూ నేడు చెన్నైలో జరిగిన ‘ఫెయిర్ డీలిమిటేషన్’ సమావేశానికి హాజరైనప్పుడు కూడా ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు.

Also Read – సంగీతంలో లెజెండ్ – మీడియా అంటే ఆమడ దూరం. వివాదాల భయమా?

డీలిమిటేషన్‌ గురించి రేవంత్ రెడ్డి చెప్పాల్సినవి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత కేటీఆర్‌ కూడా డీలిమిటేషన్‌ గురించి చెప్పాల్సిన నాలుగు ముక్కలు చెప్పేసి, ఈ పోరాటంలో అన్ని రాష్ట్రాలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.

అన్ని రాష్ట్రాలు కలిసి రావాలని చెపుతున్న కేటీఆర్‌కి దక్షిణాది రాష్ట్రాల పేర్లన్నీ గుర్తు ఉంటాయి కానీ ఆంధ్ర పేరు గుర్తుండదు. ఎందువల్ల అంటే ఆంధ్రా పేరు ఉచ్ఛరించడానికి కూడా ఇష్టపడరు కనుక! ఆంధ్ర పట్ల కేసీఆర్‌, కేటీఆర్‌లకు ఉన్న ద్వేషం ఎవరికీ తెలియనిది కాదు. కనుక ఇప్పుడు ఈ చర్చ అనవసరమే.

Also Read – మద్యం కుంభకోణం: అందరిదీ ఒకటే మాట!

అయితే సొంత రాష్ట్ర ముఖ్యమంత్రినే అవహేళన చేస్తూ, ఆయనతో చేతులు కలపడానికి కూడా ఇష్టపడని కేటీఆర్‌ ఈ పోరాటంలో అన్ని రాష్ట్రాలు కలిసి రావాలని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీల అధినేతలకు ఎవరి అజెండా వారికుంది. ఎవరి లెక్కలు వారికున్నాయి.

Also Read – చంద్రబాబు నాయుడు @75: అదే పోరాటస్పూర్తి

అందరినీ కూడదీసుకొని బలప్రదర్శన చేసి కేంద్ర ప్రభుత్వం తమ జోలికి, తమ తమిళనాడుకి జోలికి రాకుండా అడ్డుకోవాలని స్టాలిన్ ఆరాటం.

కాంగ్రెస్‌ అధిష్టానం అనుమతిస్తేనే ఈ సమావేశానికి రాగలనని సిఎం రేవంత్ రెడ్డి ముందే చెప్పారు. బీజేపిని, మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే కాంగ్రెస్‌ విదానం. కనుక కాంగ్రెస్‌ అధిష్టానం తమ ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యేందుకు అనుమతించింది. వారు కూడా సమావేశం ముగిసిన తర్వాత కేంద్రాన్ని విమర్శించి వచ్చిన పని ముగిసిననట్లు తిరుగు ప్రయాణం అయ్యారు.

సార్వత్రిక ఎన్నికలలో ఎదురుదెబ్బలు తిని నీరసించిపోయిన బిఆర్ఎస్ పార్టీకి ఇటువంటి సమావేశాలు టానిక్‌లా పనిచేస్తాయి. ఈ పేరుతో నాలుగు పార్టీలతో కలిస్తే కేటీఆర్‌కి జాతీయ నాయకుడుగా గుర్తింపు లభిస్తుంది కూడా.

తమిళనాడులో ద్రవిడ పార్టీలను ఆదర్శంగా తీసుకొని బిఆర్ఎస్ పార్టీ పనిచేయాలని కేసీఆర్‌ చెపుతుంటారు కనుక వారితో స్నేహం అవసరమే. ఒకవేళ రాబోయే రోజుల్లో ఏదైనా కేసుల కష్టం వస్తే, నాలుగు పార్టీలు వచ్చి తమకు అండగా నిలబడతాయనే చిన్న ఆశ.




కనుక ఈ సమావేశంతో పాల్గొన్న పార్టీలు ఏం సాధించబోతున్నాయో తెలీదు కానీ ఇలా దేని లెక్కలు దానికున్నాయని మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.