వాళ్ళిద్దరూ పోచమ్మ గుడి ముంగిట పొట్టేళ్ళేనట!

Minister KTR

తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియలో నేటితో నామినేషన్స్ గడువు ముగిసింది. ఈసారి సిఎం కేసీఆర్‌ గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. గజ్వేల్‌లో తాను ఆయనపై పోటీకి దిగుతున్నందునే ఈసారి కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారని బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్‌ ఎద్దేవా చేస్తున్నారు. కామారెడ్డిలో కేసీఆర్‌కి గెలిచే అవకాశం లేకుండా చేసి ఇంటికి సాగనంపేందుకే తాను ఆయనపై పోటీ చేస్తున్నానని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చెపుతున్నారు.

మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “వాళ్ళిద్దరూ కేసీఆర్‌ని ఓడగొట్టేట్టోళ్ళా… వారికి అంత కెపాసిటీ ఉందా?వాళ్ళిద్దరికీ రోజులు దగ్గర పడ్డాయి కనుకనే కేసీఆర్‌ని ఢీకొనేందుకు వచ్చారు. వాళ్ళిద్దరూ పోచమ్మ గుడి ముంగిట కట్టేసిన పొట్టేళ్ళవంటివారే. కనుక వారి పరిస్థితి ఏమవుతుందో మీరే చూస్తారు,” అని అన్నారు.

ADVERTISEMENT

“గత ఎన్నికలలో బీజేపీ రాష్ట్రంలో 119 స్థానాలకు పోటీ చేస్తే ఘోషామహల్ ఒక్క చోటే గెలిచింది. ఈసారి ఆ ఒక్క సీటు కూడా రాకుండా మేము కాలికి బలపం కట్టుకొని తిరిగి బీజేపీ అభ్యర్ధి రాజాసింగ్‌ని కూడా ఓడిస్తాము. అలాగే కొడంగల్లో రేవంత్‌ రెడ్డిని, హుజూరాబాద్‌ ఈటల రాజేందర్‌లను కూడా ఓడిస్తాము. ఈ ముగ్గురు ఓటమి ఖాయం. కావాలంటే రాసిపెట్టుకోండి. డిసెంబర్‌ 3న ఫలితాలు వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడే మీ ముందు కూర్చొని మాట్లాడుతాను,” అని కేటీఆర్‌ చాలా నమ్మకంగా చెప్పారు.

ఒకవేళ కేటీఆర్‌ చెప్పిన్నట్లు, రేవంత్‌ రెడ్డి, ఈటల రాజేందర్‌ ఇద్దరూ రెండు చోట్ల ఓడిపోతే అక్కడితో వారి కధ సమాప్తం అయిపోతుంది. కనుక కేసీఆర్‌ మీద పోటీ చేస్తూ చాలా రిస్క్ తీసుకొంటున్నట్లే భావించవచ్చు.
ఈ ఎన్నికలు కేటీఆర్‌కు కూడా చాలా కీలకం. ఒకవేళ బిఆర్ఎస్ పార్టీ ఓడిపోతే జీవితంలో ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించకపోవచ్చు. కనుక బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ఆయన సర్వశక్తులు ఒడ్డిపోరాడుతున్నారు.

అలాగే ఈ ఎన్నికలు కాంగ్రెస్ నేతలందరికీ జీవన్మరణ సమస్య వంటివే. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పదేళ్ళుగా అధికారానికి దూరంగా ఉంది. కనుక ఈసారి పార్టీ ఓడిపోతే గెలిచిన ఎమ్మెల్యేలందరూ బిఆర్ఎస్ పార్టీలోకి క్యూ కట్టేయడం, అప్పుడు కాంగ్రెస్‌ ఖాళీ అయిపోవడం రెండూ ఖాయమే.

కనుక రెండు పార్టీలు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నాయి కనుక బహుశః రెంటికీ ఇంచుమించు సరిసమానంగా సీట్లు వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ తెలంగాణ ప్రజలు రాష్ట్రాభివృద్ధినే కోరుకొంటున్నట్లయితే సర్వేలు సూచిస్తున్నట్లు బిఆర్ఎస్ పార్టీకి 119కి కనీసం 72-76 సీట్లయిన తప్పక వస్తాయి.

ADVERTISEMENT
Latest Stories