ktr-formula-one-racing

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు రాకపోవడంతో కేటీఆర్‌, హరీష్ రావు ఇద్దరూ పార్టీ బాధ్యతలు తీసుకుని దూసుకుపోతున్నారు. అయితే కేసీఆర్‌నే ఓడగొట్టి ఫామ్‌హౌస్‌లో కూర్చోబెట్టిన రేవంత్‌ రెడ్డి ముందు వారి రాజకీయాలు హనుమంతుడి ముందు కుప్పి గంతులుగానే మిగిలిపోతున్నాయి.

Also Read – స్థలాలు, పొలాల కబ్జాలు కాదు… పోర్టునే కబ్జా చేస్తే?

తాజాగా కేటీఆర్‌ కోసం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఓ కేసు సిద్దం చేస్తోంది. అది ఆటంబాంబులా పేలబోతోందని మంత్రి పొంగులేటి హింట్ ఇచ్చారు. ఆ హింట్ కేటీఆర్‌ బాగానే క్యాచ్ చేశారు. కానీ ఆయనకు ధీటుగా జవాబు చెపుతున్నాననుకొని నోరు జారారు.

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్‌ హైదరాబాద్‌లో ఫార్ములా-1 రేసింగ్ నిర్వహింపజేశారు. కానీ మొదటి విడతలో ఆశించిన స్థాయిలో లాభం రాలేదంటూ ఆ ఈవెంట్ స్పాన్సర్ ‘గ్రీన్ కో’ మద్యలో తప్పుకుంది.

Also Read – హింసలోనే క్రెజ్ వెతుకుతున్న ప్రేక్షకులు, దర్శకులు…!

అప్పుడు కేటీఆరే చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.55 కోట్లు చెల్లింపజేశారు. అదే ఇప్పుడు ఆయన పీకకు చుడుతోంది రేవంత్‌ ప్రభుత్వం.

కేటీఆర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆ డబ్బుని మంజూరు చేయించారని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరోపిస్తూ ఆయనపై కేసు సిద్దం చేస్తోంది. అదే ఆటంబాంబులా పేలబోతోందన్నారు.

Also Read – కేసీఆర్‌, కేటీఆర్‌ మద్యలో కవిత… ఏమిటో ఈ రాజకీయాలు?

కేటీఆర్‌ స్పందిస్తూ, “ఫార్ములా-1 రేసింగ్ ఈవెంట్ నిర్వహించడం వలన హైదరాబాద్‌ బ్రాండ్ ఇమేజ్‌ చాలా పెరిగింది. ఇంకా పెరుగుతుందనే ఉద్దేశ్యంతోనే రూ.55 కోట్లు చెల్లింపుకి మంత్రిగా ఫైల్‌పై నేను సంతకం చేశాను. ఫార్ములా-1 రేసింగ్ ఈవెంట్ నిర్వహించాలనే నిర్ణయం, దాని కోసం రూ.55 కోట్లు చెల్లించాలానే నిర్ణయం రెండూ నావే. వాటికి నేను పూర్తి బాధ్యత వహిస్తాను.

ఈ వ్యవహారంలో నన్ను అరెస్ట్ చేసి జైల్లో వేసి రేవంత్‌ రెడ్డి పైశాచికానందం పొందాలని అనుకుంటున్నారు. జైలుకి వెళ్ళేందుకు నేను సిద్దమే.

అయినా జైలుకి వెళితే ఏమవుతుంది? ఓ రెండు నెలలు అక్కడ యోగా వగైరా చేసుకొని చక్కగా సన్నబడి బయటకు వస్తాను. ఆ తర్వాత పాదయాత్ర మొదలుపెడతాను,” అని కేటీఆర్‌ అన్నారు.

ఇన్నేళ్ళుగా రాజకీయాలలో ఉన్న కేటీఆర్‌ ఈవిదంగా మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏ రాజకీయ నాయకుడైన పోలీసులు తనని అరెస్ట్ చేసి, జైలుకి పంపిస్తే ప్రజలలో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తారు. కానీ జైలుకి వెళ్ళి యోగా ప్రాక్టీస్ చేసుకుని ఫిట్‌నెస్ పెంచుకుంటానని కేటీఆర్‌ చెప్పుకోవడం ద్వారా తాను జైలుకి వెళ్ళిన్నా ఎవరూ బాధ పడక్కరలేదని చెప్పిన్నట్లయింది.

అదే కేసీఆర్‌ అయితే… ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, విద్యుత్ కుంభకోణాలతో తనకు సంబందమే లేదని, వాటికి ఆయా అధికారులే పూర్తి బాధ్యత వహించాలంటూ సింపుల్‌గా చేతులు దులుపుకుని తప్పించుకునే ప్రయత్నం చేశారు.

కానీ ఆయన కొడుకు కేటీఆర్‌ ‘ఫార్ములా-1 రేసింగ్ వ్యవహారం అంతా తన కనుసన్నలలోనే జరిగిందని, దానికి పూర్తి బాధ్యుడిని నేనే’ అని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరోపించక ముందే చెప్పేసుకున్నారు.




ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఆయన సోదరి కల్వకుంట్ల కవిత ఆరు నెలలు తిహార్ జైల్లో ఉండివచ్చారు. ఆమె బయటకు వచ్చి రెండు నెలలు గడువక మునుపే జైలుకి వెళ్ళేందుకు ‘నేను సిద్దం’ అంటున్నారు కేటీఆర్‌! కేసీఆర్‌, కేటీఆర్‌ ఈవిదంగా వ్యవహరిస్తుంటే బిఆర్ఎస్ పార్టీ ఎలా నడుస్తుందో?