బిఆర్ఎస్ ఓటమి తరువాత తెలంగాణ రాజకీయాలను కేసీఆర్ లైట్ తీసుకున్నారా.? లేదా పార్టీ బాధ్యతలను తన వారసుడు కేటీఆర్ కి అప్పగించి సేద తీసుకోవాలని భావించారా.? లేదా వయస్సు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలు కేసీఆర్ కి రాజకీయాల నుంచి తాత్కాలిక విశ్రాంతిని ఇచ్చాయా.?
ఇలా కేసీఆర్ మౌనం చుట్టూ, ఆయన అజ్ఞాతం చుట్టూ అనేక ప్రశ్నలు, వివిధ రాజకీయ విమర్శలు చోటు చేసుకున్నాయి. అయితే కేసీఆర్ ఈ మౌనం వెనుక కూడా ఒక రాజకీయ వ్యూహమే ఉందని, సరైన సమయం, సందర్భం వచ్చినపుడు కేసీఆర్ స్పందన చాల బలంగా ఉంటుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యర్థి పార్టీలకు, కేసీఆర్ రాక పై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారికీ గట్టి బదులు చెప్పారు.
రాజకీయాలలో ఎప్పుడు వెనకడుగు వెయ్యాలో, ఎప్పుడు ఎదురుదాడి చెయ్యాలో కేసీఆర్ కి తెలుసునని, గోడకు వేలాడదీసిన తుపాకీ కూడా సైలెంట్ గానే ఉంటుంది కానీ దాన్ని బయటకు తీసినప్పుడు దాని కథ వేరే ఉంటుందంటూ కేసీఆర్ రాక పై పంచ్ డైలాగ్స్ వేసారు.
చాలామంది మేధావులు ఏడాదిన్నర్రగా కేసీఆర్ ఎక్కడ కనిపించడం లేదని, వినిపించడం లేదంటూ అవాకులు చవాకులు పేలుతున్నారు కానీ ఒక ఉద్యమాన్ని నడిపిన నాయకుడికి ఎప్పుడు ఎటువంటి రాజకీయ వ్యూహాలు వెయ్యాలో పూర్తిగా తెలుసంటూ కేసీఆర్ పై ప్రత్యర్థి పార్టీల నేతల నుంచి సొంత పార్టీ నాయకుల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పారు.
అయితే కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఒకసారి పరిశీలిస్తే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఓటమితో బిఆర్ఎస్ శ్రేణులలో నిరుత్సాహం రెండింతలయ్యింది. కేసీఆర్ పూర్తిగా పార్టీని పట్టించుకోవడం లేదని, పార్టీ నాయకులకు క్యాడర్ కు అసలు సమయం ఇవ్వడం లేదనే భావన సొంత పార్టీ శ్రేణుల నుంచి కూడా వ్యక్తమవుతోంది.
అందుకు తోడు కేటీఆర్ నాయకత్వం, మీద ఆయన నాయకత్వ లక్షణాలు మీద చెల్లి కవిత తో పాటు బిఆర్ఎస్ ను వీడిన సీనియర్ నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారు. అలాగే వారి విమర్శలకు తగ్గట్టే కేటీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ ఇంతవరకు గెలుపు రుచి చూడలేదు.
ఈ సందర్భంగా అసలు కేసీఆర్ తిరిగి పార్టీ బాధ్యతలు స్వీకరిస్తారా.? పార్టీని అధికారం దిశగా తీసుకెళ్తారా.? అంటూ గులాబీ సేన బయపడుతుంటే, ఇక కేసీఆర్ పనైపోయింది, తెలంగాణలో బిఆర్ఎస్ కథ కంచికి వెళ్ళింది అనే ప్రత్యర్థి పార్టీల ధైర్యానికి కేటీఆర్ సమాధానం చెప్పదలచుకున్నారా.?
అందులో భాగంగానే సొంత పార్టీ శ్రేణులకు త్వరలోనే కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తారని, రాజకీయంగా యాక్టీవ్ అవుతారని వారి భయాన్ని తన మాటలతో బుజ్జగిచ్చేందుకు కేటీఆర్ శ్రమిస్తున్నారు, అలాగే ఇప్పటికి బిఆర్ఎస్ పై పై చేయి సాధిస్తున్న ప్రత్యర్థి కాంగ్రెస్ ను తన ప్రకటనలతో భయపెట్టాలనుకుంటున్నారు.






