కేసీఆర్ తెలంగాణ సిఎంగా ఓ వెలుగు వెలుగుతున్న రోజుల్లో దేశంలో అన్ని రాష్ట్రాలకు బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని, ప్రధానమంత్రిగా దేశాన్ని ఏలాలని కలలుగన్నారు. కానీ అవి పగటి కలలుగానే మిగిలిపోయాయి.
ఆయన కుమారుడు కేటీఆర్ ‘ది దేశ్‌భక్త్’ అనే న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, జాతీయ రాజకీయాల గురించి తన తండ్రి పాడిన పాటనే పాడి, కేసీఆర్ పగటి కలలకు కూడా తానే వారసుడని నిరూపించుకున్నారు.
2029లో జరుగబోయే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపిలకు కలిపి 150 సీట్లు మించిరావని, ప్రాంతీయ పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని నాడు కేసీఆర్ చెప్పిన మాటలను కేటీఆర్ కూడా వల్లె వేశారు.
బీఆర్ఎస్, వైసీపీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకె వంటి బలమైన ప్రాంతీయ పార్టీలు ఏ కూటమిలో చేరకుండా ఉన్నాయని అటువంటి 13 పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని కేటీఆర్ జోస్యం చెప్పారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో తమ పార్టీ కేవలం 1.8 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయిందని, కనుక లోపాలు సరిచేసుకొని వచ్చే ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి రాగలమని కేటీఆర్ చెప్పారు.
తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తన ప్రభుత్వం, పాలన గొప్పదనం గురించి వందల కోట్లు ఖర్చు చేసి మీడియా ప్రకటనలు ఇచ్చుకున్నారు. టిఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్ పార్టీగా మార్చేసుకున్నారు.
కానీ అంత మాత్రాన్న దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు కేసీఆర్‌కి జేజేలు పలుకుతారని ఎలా అనుకున్నారో తెలీదు, కాంగ్రెస్, బీజేపిలతో ఏదో ఓ పార్టీతో చేతులు కలపకపోతే ప్రాంతీయ పార్టీలు జాతీయస్థాయి వరకు చేరుకోలేవు. ప్రాంతీయ పార్టీలుగానే మిగిలిపోతాయనే విషయం కేసీఆర్ గ్రహించలేదు లేదా అంగీకరించలేదు.
కనుకనే అయన జాతీయ కలలు పగటి కలలుగా మిగిలిపోయాయి. కానీ అలా ప్రాంతీయ పార్టీలుగా బలంగా, భద్రంగా ఉంటే చాలని తృప్తిపడే జగన్, స్టాలిన్ వంటివారిని కలుపుకొని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని నాడు కేసీఆర్, ఇప్పుడు కేటీఆర్ పగటి కలలు కంటున్నారు.
వచ్చే శాసనసభ ఎన్నికలో గెలవడం బీఆర్ఎస్ పార్టీ చాలా అవసరం. లేకుంటే ఆ పార్టీ కనపడకుండా మాయం అయ్యే ప్రమాదం పొంచి ఉంది.
కానీ కేసీఆర్ ఆరోగ్య సమస్యలతో ఫామ్‌హౌసుకే పరిమితమవడం, కవిత తిరుగుబాటు, కేటీఆర్-హరీష్ రావుల మద్య విభేదాలు, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపిల నుంచి గట్టి పోటీ, బీజేపితో టీడీపి, జనసేనలు కలిసి పోటీ చేయడం లేదా బీజేపికి మద్దతు ప్రకటించడం వంటి అనేక అంశాలు ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయి.
కేసీఆర్ ఫామ్‌హౌసులో ఉండిపోయి కేటీఆర్‌కి బీఆర్ఎస్ పార్టీని అప్పగిస్తేనే నడిపించలేక, ఆ అసహనాన్ని ఏపీ, తెలంగాణ సిఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిపై చూపిస్తున్నారు. కనుక ఇన్ని సమస్యలను అధిగమించి వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ గెలిపించుకోగలరా? అంటే అనుమానమే!






