అవును. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మాట చెప్పారు. నేడు తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో మాట్లాడుతూ, “ఈ రేవంత్ రెడ్డి పాలన ఇక మూన్నాళ్ళ ముచ్చటే. తర్వాత మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో కూడా ఘోరంగా విఫలమైంది. అందుకే దానికి బదులు సీజేపీ కేంద్రంతో పోరాడుతోంది. వచ్చే ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో కేసీఆర్, కాంగ్రెస్, బిజేపియేతర పార్టీలు కీలకపాత్ర పోషించబోతున్నాయి,” అని కేటీఆర్ అన్నారు.
నాడు కేసీఆర్ ఇలాంటి పగటి కలలు కంటూ చాలా హడావుడి చేశారు. కానీ చివరికి తన సొంత జాగీరుగా భావించే తెలంగాణలోనే ఓడిపోయారు.
దేశ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు తెస్తానని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ జీవితంలోనే ఆ మార్పు వచ్చింది. తత్ఫలితంగా దాదాపు మూడేళ్ళుగా ఫామ్‌హౌసులో నుంచి కాలు బయటపెట్టడం లేదు.
ఒకవేళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలనతో వేసారిపోయినట్లయితే, వారు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ని మళ్ళీ గెలిపిస్తారనుకోవడం రాజకీయ దురాశే.
ఎందుకంటే, ఒకవేళ ప్రజలు కాంగ్రెస్‌ను వద్దనుకుంటే దానికి ప్రత్యామ్నాయంగా బిజేపి ఉంది. ఈసారి దానికీ ఓ అవకాశం ఇవ్వవచ్చు. లేదా రాష్ట్రాన్ని అమ్మలా పాలిస్తానంటూ పాంచజన్యం పూరిస్తున్న టిఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితకు అవకాశం ఇవ్వవచ్చు. లేదా అన్ని పార్టీల మద్య ఓట్లు చీలిపోతే ఏ పార్టీకి మెజార్టీ రాక హంగ్ ఏర్పడవచ్చు.
కానీ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా, శాసనసభ సమావేశాలకు హాజరుకాకుండా మూడేళ్ళుగా ఫామ్‌హౌసులో కాలక్షేపం చేస్తున్న కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారనుకోవడం అత్యాశే అవుతుంది కదా? నిజానికి కేసీఆర్‌ని చూపిస్తూ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని కేటీఆర్ ఆశపడుతున్నారని చెప్పవచ్చు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే, మళ్ళీ జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తారని చెప్పుకోవడం బాగానే ఉంది. కానీ కాంగ్రెస్ విఫలం అయ్యింది కనుకనే సీజేపీ కేంద్రంతో పోరాడుతోందని కేటీఆర్ అంతటి రాజకీయ అనుభవజ్ఞుడు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
ఎందుకంటే, సీజేపీని ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీయే మోడీ ప్రభుత్వంతో పోరాడుతుండటం ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది కదా?దాని పోరాటాలతోనే దేశంలో మళ్ళీ బిజేపియేతర, మోడీ వ్యతిరేక శక్తులు ఏకం అవుతున్నాయి కదా?
కనుక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని, సిఎం రేవంత్ రెడ్డిని కేసీఆర్, కేటీఆర్ అసహ్యించుకున్నంత మాత్రాన్న జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పనికిరాకుండా పోదు. అయినా జాతీయ స్థాయి రాజకీయాలలో కేసీఆర్, కేటీఆర్ కంటే సిఎం రేవంత్ రెడ్డి కూడా బాగా రాణిస్తున్నారు కదా?
దేశంలో ప్రాంతీయ పార్టీలలో చాలా వరకు అయితే బిజేపి, లేకుంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నాయని కేసీఆర్‌కు బాగా తెలిసి ఉన్నప్పుడు, రాజకీయ నిరుద్యోగులను పోగేసి డబ్బు వెదజల్లి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనే కేసీఆర్ ఆలోచనే లోపభూయిష్టంగా ఉంది కదా?
అయినా 17 ఎంపీ సీట్లు కూడా గెలుచుకోలేకపోయిన కేసీఆర్‌ని, 50-70 ఎంపీ సీట్లు గెలుచుకున్న ఉత్తరాది పార్టీలు నాయకుడుగా ఎలా అంగీకరిస్తాయి?
తన ఆలోచన లేదా తన రాజకీయ విధానంలో ఉన్న ఇటువంటి లోపాలను గుర్తించి సరిదిద్దుకోలేని వ్యక్తి, దేశ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు తెస్తానంటే ప్రజలు ఎలా నమ్ముతారు?
కానీ డా.అబ్దుల్ కలాం కలలు కనమని చెప్పారు. కనుక కేటీఆర్‌కి కూడా ఇలాంటి పగటి కలలు కనే హక్కు ఉంటుంది. దానిని ఎవరూ కాదనడానికి వీల్లేదు అంతే!





