అధికారం పవరా..? రేవంత్ టాలెంటా..?

Revanth Reddy

సొంత పార్టీ నేతల మధ్యే సఖ్యత ఉండదు, ఆ పార్టీలో నేతలకన్నా ముఖ్యమంత్రి అభ్యర్థులే ఎక్కువ, అటువంటి పార్టీ తరుపున పోటీ చేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఐపోవాలని చూస్తున్న రేవంత్ రెడ్డి ని చూస్తుంటే జాలేస్తుంది అంటూ ఎద్దేవా చేసిన ప్రత్యర్థి పార్టీలకు కాంగ్రెస్ నేతలు ఇప్పుడు సరైన సమాధానము చెపుతున్నారు.

తమ పార్టీలో నేతల మధ్య ఉన్న ఐక్యతను, ముఖ్యమంత్రి రేవంత్ పట్ల తమ కున్న గౌరవాన్ని, ప్రేమను ప్రత్యర్థి పార్టీల నేతలకు అర్థమయ్యేలా చెపుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ మాజీ ఐటీ మంత్రి, బిఆర్ఎస్
నేత కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ వేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.

ADVERTISEMENT

“నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రివి కాదు, అధిష్ఠానము మేనేజ్మెంట్ కోటాలో ఎన్నికైన ముఖ్యమంత్రివి, మాణిక్కం ఠాగూర్ కు 50 కోట్లి ఇచ్చి మేనేజ్ చేసి ఈ పదవి సంపాదించుకున్నావ్, ఎన్నటికీ కేసీఆర్ కాలిగోటికి కూడా నువ్వు సరిపోవు గుర్తుపెట్టుకో” అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చే పనిలో పడ్డారు.

ముఖ్యమంత్రి రేవంత్ పై ఇటువంటి నిరాధార ఆరోపణలు చేస్తున్న కేటీఆర్ పై మధురై హై కోర్టులో పరువు నష్టం దావా వేయనున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు తెలంగాణ పీసీసీ మాజీ చీఫ్ మాణిక్కం ఠాగూర్. అలాగే బిఆర్ఎస్ నేతలు తమ పద్దతి మార్చుకోవాలంటూ, ప్రస్వామ్యయుతంగా ఎంపికైన ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కించపరుస్తూ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు వారి అహంకారానికి పరాకాష్ట అంటూ కాంగ్రెస్ నేత మల్లు రవి కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు.

కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోడు అన్న వ్యక్తే కేసీఆర్ ప్రభుత్వాన్ని ను గద్దె దింపి మిమ్మల్ని ఫామ్ హౌస్ లో కుర్చోపెట్టాడు, కాలి గోటికి సరిపోని వ్యక్తే మిమ్మల్ని తొక్కితే ఒక్కొక్కరు 50 వేల ఓట్ల మెజారిటీ తో ఓడిపోయారు, అసలు నువ్వు రేవంత్ రెడ్డి చిటికెన వేలుకు సరిపోవు అంటూ కేటీఆర్ పై రెచ్చిపోయారు రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి.

అలాగే మంత్రి సీతక్క, ఇంకా పలువురు కాంగ్రెస్ నేతలు కూడా కేటీఆర్ వ్యాఖ్యలకు తమదైన శైలిలో సమాధాన మిచ్చి కాంగ్రెస్ పార్టీ ఐక్యతను, ముఖ్యమంత్రి పై తమకున్న అభిమానాన్ని బిఆర్ఎస్ నేతలకు అర్థమయ్యేలా చెప్పారు. గతంలో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుని, ముఖ్యమంత్రి అభ్యర్థిని నేనంటే నేను అంటూ ఢిల్లీలో పైరవీలు చేసే నేతలంతా ఇప్పుడు ఒకే తాటి పైకి రావడం చూస్తుంటే ఇదంతా “అధికారం పవరా..?లేక రేవంత్ టాలెంటా..?”అంటూ నోరెళ్లపెడుతున్నారు ప్రత్యర్థి పార్టీల నేతలు.

ADVERTISEMENT
Latest Stories