
తెలంగాణ రాజకీయాలను కంటి సైగతో శాసించిన కేసీఆర్‌కి బిఆర్ఎస్ పార్టీకి ఇది చాలా కష్ట కాలమనే చెప్పాలి. ఎన్నికలలో ఓటమి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫిరాయింపులు, మద్యం కేసులో కూతురు అరెస్ట్, పార్టీపై కూతురు తిరుగుబాటు.. మరోపక్క ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఎఫ్-1 రేసింగ్ కేసులు.. ఒకటా రెండా అనేక కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి బిఆర్ఎస్ పార్టీని తరముతూనే ఉన్నాయి.
ఇటువంటి సమయంలో బిఆర్ఎస్ పార్టీ మరింత నిబ్బరంగా, సంయమనంగా వ్యవహరిస్తూ ప్రజల మద్యకు వెళ్ళి వారి మనసులు గెలుచుకోవాలి. ఏపీలో టీడీపీ ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలు అలాగే చేసి ప్రజల మనసులు గెలుచుకొని మళ్ళీ అధికారంలో వచ్చారు కదా?
Also Read – కూటమి పై సామాన్యుడి ఆగ్రహం…
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలో చంద్రబాబు నాయుడు చూపితే, ఎలా వ్యవహరించకూడదో జగన్ చూపుతున్నారు కదా?
కనుక వైసీపీ, టీడీపీల నుంచి తప్పులు, ఒప్పులు నేర్చుకొని కేటీఆర్ జాగ్రత్తగా పార్టీని నడిపించుకుంటూ పార్టీని మళ్ళీ గెలిపించుకొని తన సమర్దత నిరూపించుకోవచ్చు.
Also Read – ఒకరు సస్పెండ్.. మరొకరు సస్పెన్స్.. అయినా తీరు మారలే!
నిజానికి కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు రాకుండా ఉండిపోయి కేటీఆర్‌కి ఇటువంటి గొప్ప అవకాశం కల్పించారని చెప్పవచ్చు. కానీ కేటీఆర్ తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చాలా చులకనగా, అసభ్యంగా మాట్లాడుతూ, దీనినే ప్రజాసమస్యలపై ప్రభుత్వంతో పోరాటం అనుకోమన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ‘మహాటీవీ’ కేటీఆర్‌పై తప్పుడు కధనాలు ప్రసారం చేస్తోందంటూ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నేడు ఫిలిమ్ నగర్‌లోని ఆ చానల్ కార్యాలయంపై దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. ఓ మీడియా సంస్థపై ఓ రాజకీయ పార్టీ దాడి చేస్తే సహజంగానే దేశవ్యాప్తంగా అది సంచలన వార్త అవుతుంది. ఇప్పుడు అదే జరిగింది.
Also Read – కోటా శ్రీనివాసరావు ఇక లేరు
పైగా పోలీసులు బిఆర్ఎస్ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. దీనిలో కూడా కేటీఆర్ పేరు చేర్చకుండా ఉండరు. కనుక చేజేతులా మరో సమస్య సృష్టించుకున్నట్లయింది.
రాజకీయ ప్రత్యర్ధులు, మీడియా తప్పటడుగులు వేసేలా చేస్తుంటే వేయకుండా నిగ్రహించుకొని ఎత్తుకు పైఎత్తు వేస్తూ ముందుకు సాగగలిగితేనే రాజకీయాలలో ఎవరైనా రాణించగలరు. ఇందుకు మంత్రి నారా లోకేష్ నిదర్శనం.
ఒకవేళ కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ నడిపించలేరని కేసీఆర్ భావిస్తే, పగ్గాలు చేపట్టడానికి హరీష్ రావు రెడీగానే ఉన్నారు. అదీ కుదరదనుకుంటే కల్వకుంట్ల కవిత చెప్పినట్లు బీజేపిలో విలీనం చేసి చేతులు దులుపుకున్నా ఆశ్చర్యం లేదు. కనుక కేటీఆర్ అవసరమైతే రాజకీయాల నుంచి కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని ఓసారి ఆత్మావలోకనం చేసుకోవడం చాలా అవసరమనిపిస్తుంది.