కేటీఆర్ బావమరిది రాజ్ (రాజేంద్ర ప్రసాద్) పాకాల ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి జరిగిన రేవ్‌పార్టీపై పోలీసులు దాడి చేసి ఖరీదైన విదేశీ మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్నవారిలో మద్దూరి విజయ్ అనే వ్యక్తి కొకైన్ సేవించిన్నట్లు నిర్ధారణ అయ్యింది. పోలీసులు మద్యం బాటిళ్ళు స్వాధీనం చేసుకొని రాజ్ పాకాలపై కేసు నమోదు చేశారు.
కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో రేవ్‌పార్టీ జరగడంతో బీజేపీ నేతలు కేటీఆర్‌ని నిలదీస్తున్నారు. అయితే వారు ఊహించని జవాబు కేటీఆర్ ఇచ్చారు.
“నన్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నా బావమరిదిపై ఈ అక్రమకేసు బనాయించి నన్ను అప్రదిష్టపాలు చేయాలని ఈ కుట్ర చేసింది.
రాజ్ పాకాల కొత్తగా ఇల్లు కట్టుకొని గృహాప్రవేశం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన బంధుమిత్రులకు విందు, మద్యం (దావత్) ఏర్పాటు చేశారు. దానినే రేవ్‌పార్టీ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కక్షపూరిత కుట్రలు, బీజేపీ ఈ నీచరాజకీయాలు మానుకుంటే మంచిది,” అని వాదించారు.
గృహాప్రవేశ కార్యక్రమాన్ని పురస్కరించుకొని దావత్ ఇచ్చారని కేటీఆర్ చెపుతున్నారు. దానినే రేవ్‌పార్టీ అని పోలీసులు చెపుతున్నారు. బావమరిది గృహాప్రవేశమే అయితే దానిలో కేటీఆర్, సతీమణి కూడా పాల్గునే ఉంటారు కదా?కానీ పోలీసులు రైడ్ చేసినప్పుడు వారిద్దరూ ఎక్కడున్నారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
పోలీసులు వారిని తప్పించేసి ఉండవచ్చని కేంద్రమంత్రి బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. రేవ్‌పార్టీపై దాడి జరిపినప్పుడు పోలీసులు వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియోని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులాగే దీనిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటకెక్కించేయకుండా చిత్తశుద్ధి ఉంటే తక్షణం వీడియోని బయటపెట్టి, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, “రాష్ట్రంలో ఎవరైనా దావత్ (విందు) ఇచ్చుకోవచ్చు. దానిపై ఎటువంటి ఆంక్షలు లేవు. అయితే పరిమితికి మించినప్పుడు ఎక్సైజ్ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. కానీ తీసుకోలేదు. కనుకనే పోలీసులు రైడ్ చేశారు. అందుకు బిఆర్ఎస్, బీజేపీ నేతలు మా ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు,” అని అన్నారు.
అంటే రేవ్‌పార్టీ గృహాప్రవేశంగా తర్వాత ‘దావత్’గా మారడం చూస్తే ఈ వ్యవహారంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మద్య సెటిల్‌మెంట్ అయిపోయిన్నట్లే అని బండి సంజయ్ ఆరోపించారు.
మరోపక్క రాజ్ పాకాల హైకోర్టులో పిటిషన్ వేసి “కేటీఆర్‌ని అప్రదిష్ట పాలు చేసేందుకు రాజకీయ దురుదేశ్యంతోనే రేవ్‌పార్టీ అంటూ పోలీసులు కేసు నమోదు చేశారని, కనుక తనపై ఎటువంటి చర్య తీసుకోకుండా స్టే ఇవ్వాలని కోరారు. ఆయన లాయర్ ద్వారా పోలీసులకు సంజాయిషీ ఇచ్చేందుకు హైకోర్టు రెండు రోజులు గడువు ఇచ్చింది. అంతవరకు అరెస్ట్ చేయరాదని ఆదేశించింది.
ఈ రేవ్‌పార్టీ లేదా దావత్ వ్యవహారం బిఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ఎందువల్ల అంటే దీనిపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న వాదనల కంటే కేటీఆర్ బావమరిది ఇంట్లో రేవ్‌పార్టీ జరిగి, పోలీసులు కేసు నమోదు చేశారనే వార్తే చాలా స్పైసీగా ఉంది గనుక!




