ఆ ఒక్కటీ అడగొద్దు!

Lok Sabha, Assembly Seats Set to Rise 50% Debate

లోక్‌సభ, శాసనసభ స్థానాలను 50 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ 175 సీట్లు 263కి, లోక్‌సభ సీట్లు 25 నుంచి 38కి పెరుగుతాయి.

ఇదేవిధంగా తెలంగాణ శాసనసభ 119 సీట్లు 179కి, లోక్‌సభ సీట్లు 17 నుంచి 26కి పెరుగుతాయి.

ADVERTISEMENT

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కలిపి ప్రస్తుతం 4,123 అసెంబ్లీ స్థానాలు 6,185కి పెరుగుతాయి. లోక్‌సభ స్థానాలు 543 నుంచి 816కి పెరుగుతాయి.

అంటే మరింత మంది ప్రజాప్రతినిధులు రాబోతున్నారన్న మాట! పెరిగిన దేశ జనాభాకు తగ్గట్లు చట్ట సభలలో ప్రజా ప్రాతినిధ్యం కూడా తప్పకుండా పెరగాల్సిందే.

కానీ దేశంలో ఎంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఎంతమంది తమ తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేయగలుగుతున్నారు? అభివృద్ధి సంగతి దేవుడెరుగు కనీసం ప్రజా సమస్యలను పట్టించుకుంటున్నారా? కనీసం శాసనసభ, పార్లమెంట్ సమావేశాలకైనా హాజరవుతున్నారా? అనే ప్రశ్నలకు సమాధానాలు అందరికీ తెలుసు.

ప్రజాసేవ కోసమే రాజకీయాలలోకి వచ్చామని చెప్పుకునే ప్రతినిధులలో చాలా మందికి రకరకాల వ్యాపారాలు, కాంట్రాక్టులు, పరిశ్రమలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు వగైరా ఉంటాయి. వాటికే సమయం సరిపోదు. మిగిలిన సమయం కేవలం రాజకీయాలకు సరిపోతుంది.

కనుక చట్ట సభలకు వెళ్ళకుండా, ప్రజా సమస్యలు, నియోజకవర్గాల అభివృద్ధిని పట్టించుకోని వారు కోటి మందున్నా ఉపయోగం లేదు.

ప్రజాప్రతినిధులు అందరూ ఇలాగే ఉంటారని కాదు కానీ అత్యధిక శాతం మంది మాత్రం ఇలాగే ఉంటారు. ఈ లెక్కన చట్ట సభలలో 50 శాతం సీట్ల పెంపు ప్రతిపాదన వృధా, ప్రజాధనం దుబారాగానే అనిపిస్తుంది.

మనది ప్రజాస్వామ్య దేశమే అయినప్పటికీ దేశాన్ని రాజకీయ పార్టీలే శాశిస్తున్నాయి. కనుక వాటిలో రాజకీయ నిరుద్యోగులకు తప్పనిసరిగా ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంది. లేకుంటే అసంతృప్తి జ్వాలలతో ప్రభుత్వాలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది.

కనుక 50 శాతం సీట్ల పెంపుతో అన్ని పార్టీలలో రాజకీయ నిరుద్యోగులకు పదవులు, అధికారం, భారీగా జీతభత్యాలు, బుగ్గకార్లు, జెడ్ ప్లస్ సెక్యూరిటీ వగైరా లభిస్తాయి. ప్రజల కష్టార్జితంతో ఇన్ని తీసుకుంతునప్పుడు మరి ప్రజలకు న్యాయం చేస్తారా? ఆ ఒక్కటీ అడగొద్దు!

ADVERTISEMENT
Latest Stories