ఎక్కడో యుద్ధం, మరెక్కడో నష్టం కానీ ప్రపంచం మొత్తం సంక్షోభం. ఇరాన్ పై ఇజ్రాయిల్, అమెరికా సాగిస్తున్న యుద్ధం ప్రభావం మొత్తం ప్రపంచాన్ని ఆర్ధిక సంక్షోభం దిశగా నడిపిస్తుంది. అలాగే ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. అయితే ఈ యుద్ధ ప్రభావం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ రూపం లో భారత్ ను కూడా తాకింది.
భారతదేశంలో ఇప్పుడు ప్రజలు వంట గ్యాస్ లభ్యత పై తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ ఖాళీ అయితే మళ్ళీ బండ ఇంటికి రావడానికి ఎంత సమయం పడుతుందో అన్న భయం ప్రతి సామాన్య గృహిణిని వేధిస్తుంది.
అలాగే రెస్టారెంట్స్, హోటల్స్, పీజీ హాస్టల్స్, టిఫన్ సెంటర్స్ వంటి వ్యాపార వేత్తలకు కమర్షియల్ సిలిండర్ల కొరత రావడంతో డొమెస్టిక్ సిలిండర్ల వినియోగదారులతో కూడా భయాందోళన మొదలయ్యింది. అయితే అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంతలా వారిస్తున్నా ప్రజలలో ఈ భయం పెరుగుతూనే వస్తుంది.
అయితే నిషేధం విధించిన కట్టెల పొయ్యికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చే స్థాయికి ఈ సమస్య తీవ్రత వెళ్ళిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో విపరీతమైన కాలుష్యం కారణంగా ఆ నగరంలో కట్టెల పొయ్యికి గతంలో కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అయితే ఇప్పుడు ఆ నిబంధనను సడలిస్తూ ఢిల్లీలో కట్టెలపొయ్యికి కేంద్రం అనుమతినిస్తూ ప్రకటన చేసింది.
దీనితో ఒక్క సంక్షోభం తరాల వెనక్కి నెట్టిందా అన్న చర్చ నడుస్తుంది. కట్టెల పొయ్యి నుంచి ఎదిగి ఎదిగి LPG కి వెళ్లి ఇక అక్కడి నుంచి ఇండక్షన్ వరకు అడుగులేసింది భారత్, కానీ నేడు తిరిగి మళ్ళీ కట్టెల పొయ్యి వైపు చూస్తుంది. అంటే మన మూలలను భావితరానికి తెలియచెప్పడానికే ఈ యుద్ధ సంక్షోభం భారత్ ముందు నిలిచిందా అన్నట్టుంది.




