మహారాష్ట్ర, ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. మహారాష్ట్రలో బిజీపీ, శివసేనల మహాయుతి కూటమి గెలిచి మళ్ళీ అధికారంలోకి రాబోతోంది. అలాగే ఝార్ఖండ్ రాష్ట్రంలో కూడా అధికార జేఎంఎమ్, కాంగ్రెస్ మిత్రపక్షాల కూటమి గెలిచి అధికారంలోకి రాబోతోంది.
ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం మహారాష్ట్రలో 288 స్థానాలలో మహాయుతి కూటమి 198, కాంగ్రెస్, మిత్రపక్షాల కూటమి ఎంవీఏకు 55, ఇతరులకి 12 సీట్లు ఆధిక్యంలో సాగుతున్నాయి. వాటిలో మహాయుతి 21, ఎంవీఏ 3 స్థానాలలో విజయం సాధించాయి. కనుక మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం పూర్తి మెజార్టీతో అధికారంలోకి రాబోతోంది.
ఝార్ఖండ్ రాష్ట్రంలో మొత్తం 88 స్థానాలలో అధికార జేఎంఎమ్, కాంగ్రెస్ మిత్రపక్షాల కూటమి 52 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతుండగా, బిజేపీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ 28 స్థానాలకు పరిమితం అయ్యింది.
కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలకు మహారాష్ట్రలో గెలుపు కీలకంగా భావించాయి. దీని కోసం బీజేపీ మిత్రపక్షమైన శివసేనలో ఏక్ నాధ్ షిండే చేత ఆ పార్టీని నిలువుగా రెండుగా చీల్చి బలహీనపరిచింది. అక్కడ బిజేపీ వ్యూహం ఫలించింది కానీ ఝార్ఖండ్ రాష్ట్రంలో బెడిసి కొట్టింది. దళిత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పై అక్రమ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టడంతో ఏదో విదంగా సోరెన్ ప్రభుత్వాన్ని దెబ్బ తీసి అధికారం చేజిక్కించుకోవడానికి బిజేపీ ఎంతకైనా తెగిస్తుందనే తప్పుడు సంకేతాలు ప్రజలకు వెళ్ళాయి.
ఏపీలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి టీడీపీని నామరూపాలు లేకుండా చేసేదామని జగన్ ప్రయత్నిస్తే, అదే కారణంగా ప్రజలకు ఆయనపై సానుభూతి ఏర్పడి అది టీడీపీ ఘన విజయాన్ని అందించింది. ఆదేవిదంగా ఝార్ఖండ్ రాష్ట్రంలో గిరిజనులకు ప్రతినిధిగా భావిస్తున్న ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించినందుకు బీజేపీ దెబ్బయిపోయింది.
కానీ కీలకమైన మహారాష్ట్రలో గెలిచినందుకు బీజేపీ సంబరాలు చేసుకుంటుండగా, అనేక కుట్రలు , సవాళ్ళు ఎదుర్కొని ఝార్ఖండ్లో మళ్ళీ అధికారంలోకి వచ్చినందుకు జేఎంఎమ్, కాంగ్రెస్ కూడా సంబరాలు చేసుకొంటున్నాయి.




