వివాదాలకు దూరంగా అసందర్భ వ్యాఖ్యలకు తావు లేకుండా ‘షార్ట్ అండ్ సింపుల్’గా మాట్లాడే ప్రిన్స్ మహేష్ బాబు ‘ఐఫా’ అవార్డుల వేదికపై చేసిన ఓ చిన్న కామెంట్ ‘మెగా’ హీరోకు సూటిగా తగిలిందని నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చకు తెరలేపారు. “శ్రీమంతుడు” సినిమాకు గానూ ‘ఉత్తమ నటుడు’ అవార్డును సొంతం చేసుకున్న ప్రిన్స్ మహేష్ బాబును ‘శ్రీమంతుడు’ సినిమా మాదిరే ఒక సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మెగా హీరో కం యాంకర్ అయిన అల్లు శిరీష్ కోరారు.
“జూనియర్స్ కు ఏదైనా మెస్సేజ్ లాంటిది, ఇన్ఫర్మేషన్ లాంటిది ఇవ్వండి” అని మెగా హీరో అంటే… “జూనియర్స్ కు మెస్సేజ్ లాంటిది ఏం లేదండి… మీకు ఎవరిస్తారు మెస్సేజ్ లు చెప్పండి…” అంటూ ప్రిన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చలకు దారి తీసింది. పరోక్షంగా అల్లు శిరీష్ ను ఉద్దేశించే ప్రిన్స్ కౌంటర్ వేసారని నెటిజన్లు అంటుండగా, నిజంగానే ఈ తరానికి ఎవరూ సందేశం ఇవ్వనవసరం లేదని, ప్రిన్స్ వ్యాఖ్యలు దానికి నిదర్శనమేనని మరికొందరు అంటున్నారు.
ఈ సందర్భంగా వివిధ సందర్భాలలో మహేష్ పై నమ్రత, త్రివిక్రమ్, పూరీ జగన్నాధ్ లు వంటి వారు చేసిన కామెంట్స్ ను గుర్తుకు తెస్తున్నారు. ప్రిన్స్ మహేష్ బాబులో బాగా నచ్చేది ఏంటి అన్న ప్రశ్నకు… ఈ ముగ్గురు ఒకే విధమైన సమాధానం “సమయస్ఫూర్తి” అని చెప్పారు. బహుశా ఈ సందర్భంగా మరోసారి అందరికీ తెలిసిందేమోనని అన్న మాటలు వినపడుతున్నాయి.



