‘పోకిరి’ ప్రభంజనం తర్వాత తెరుకోలేని ప్రిన్స్ మహేష్ బాబుకు వరుసగా ‘సైనికుడు, అతిథి’ రూపంలో రెండు వైఫల్యాలు చవిచూసాయి. దీంతో ఎలాంటి సినిమా చేయాలో పాలుపోని ప్రిన్స్ కెరీర్ కు దాదాపుగా మూడేళ్ళు బ్రేక్ పడింది. ఈ మధ్యలో వ్యక్తిగతంగా కూడా కుటుంబం ఒడిదుడుకులకు లోను కావడంతో… ప్రిన్స్ ఎప్పుడెప్పుడూ వెండితెరపై కనిపిస్తారా అని అభిమానులు వేయికళ్ళతో వేచిచూస్తున్న రోజులవి. అయితే ‘అతిథి’ విడుదలైన రెండేళ్ళ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాను ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.
కానీ, అది కాస్త వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. దీంతో ప్రిన్స్ అభిమానుల్లో మరింత నిరీక్షణ పెరిగిపోయింది. అలా ఆరు మాసాలు గడిచిన మీదట ఎట్టకేలకు ప్రారంభమైన షూటింగ్ ను కేవలం అయిదారు మాసాలలోనే ముగించింది త్రివిక్రమ్ యూనిట్. పూర్తి చేసిందే తడవుగా ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లో ఒక సూపర్ స్టార్ మూడేళ్ళ పాటు విరామం తీసుకుని, సిల్వర్ స్క్రీన్ పై దర్శనం ఇవ్వడానికి సిద్ధం కావడంతో ఎక్కడలేని భారీ అంచనాలన్నీ “ఖలేజా”పై నెలకొన్నాయి. దీనికి తోడు రోమాలు నిక్కపోడుచుకునేలా సాగిన ‘సదా శివ’ ప్రమోషన్ వీడియో సాంగ్ చూసి అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
అలా సాగుతున్న ప్రమోషన్ లో ఓ భారీ ‘ట్విస్ట్.’ ఈ టైటిల్ తమదంటూ కోర్టులో కేసులు దాకా వెళ్ళిన ఉదంతం బహుశా ప్రిన్స్ అభిమానులు మరిచిపోయి ఉండకపోవచ్చు. దీంతో ‘ఖలేజా’ కాస్త ‘మహేష్ ఖలేజా’గా మారింది. అక్కడ మారిన ఫేట్ సినిమా విడుదలతో పతాక స్థాయికి చేరుకుంది. అక్టోబర్ 7వ తేదీ సమీపిస్తుందనంగా విజయవాడలో అర్ధరాత్రి సమయంలో బెనిఫిట్ షో ప్రదర్శన. మరో పక్కన నగరంలోని ధియేటర్ ప్రాంగణలన్నీ అభిమానులతో కోలాహలం. ఎంత సమయమైనా ఈ షో టాక్ తెలుసుకుని వెళ్దామని భావించిన అభిమానులకు సినిమా పూర్తయ్యే పాటికి నీరసపు ముఖాలు దర్శనమిచ్చాయి.
ఇక, చెప్పడానికేముంది. ఈ టాక్ ఏపీ వ్యాప్తంగా పాకిపోయింది. ఫస్ట్ డే షో పడకముందే డివైడ్ టాక్ ప్రారంభమైంది. అక్కడితో మొదలైన ‘మహేష్ ఖలేజా’ ఇక లేవలేదు. అయితే ధియేటర్ లోపల పరిస్థితులు మాత్రం వేరు. సాధారణంగా సినిమా బాగోకపోతే ప్రేక్షకులు మధ్యలోనే బయటకు వచ్చేస్తారు. కానీ, ‘ఖలేజా’ సినిమా ఇందుకు విరుద్ధం. ప్రతి సన్నివేశాన్ని చూసి హాయిగా నవ్వుకుని, ధియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు మాత్రం ‘బాలేదు’ అని చెప్పడం ప్రేక్షకుల వంతయ్యింది. ఈ టాక్ రావడానికి ఉన్న అనేక కారణాలలో ‘పబ్లిసిటీ’ లోపం స్పష్టంగా కనపడింది. ‘పవర్ ఫుల్’ సినిమాగా పబ్లిసిటీ చేసి, ధియేటర్లో ఫుల్ కామెడీ చేసేపాటికి ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.
అయితే, ‘ఖలేజా’ సినిమా అంటే చెవికోసుకునే ప్రేక్షకులకు కొదవలేదు. ‘త్రివిక్రమ్ డైలాగ్స్ ను మహేష్ బాబు చెప్పినంతగా మరొకరు చెప్పలేరు’ అనే స్థాయిలో ప్రతి సన్నివేశంలో అద్భుతమైన కామెడీని పండించారు. ఒక రకంగా మహేష్ లో ఇంత కామెడీ యాంగిల్ ఉంటుందని కూడా ఎవరికీ తెలియలేదు. ఆ తర్వాతే మహేష్ కామెడీ టైమింగ్ బాగా పెరిగింది, ఏ సినిమా చేసినా ప్రిన్స్ పలుకుతున్న డైలాగ్ లకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. అలాగే మహేష్ లోని సరికొత్త నటనను వెలికి తీయడంలో త్రివిక్రమ్ నూటికి 200 శాతం సక్సెస్ అయ్యారు. ఈ ప్రభావం బుల్లితెర మీద బాగా కనపడుతోంది.
ఈ సినిమా విడుదలై ఆరేళ్ళు గడిచినా… ఇప్పటికీ బుల్లితెర మీద ప్రదర్శిస్తే… వేచిచూసే అభిమానులకు కొదవలేదు. కమర్షియల్ గా ‘దూకుడు’ సినిమా మహేష్ ను మరో స్థాయికి తీసుకువెళ్ళిందేమో గానీ, ఒక నటుడుగా ప్రిన్స్ కెరీర్ ను మలుపు తిప్పింది మాత్రం “మహేష్ ఖలేజా” చిత్రమే. “అద్భుతం జరిగేటపుడు ఎవరూ గుర్తించలేరు…. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు…” అనే డైలాగ్ ఈ సినిమాకు సరిగ్గా సరిపోతుంది.



