ఏపీలో ప్రతిపక్షాలకు నో ఎంట్రీ… నో పర్మిషన్స్!

Merugu Nagarjuna said will stop nara lokesh padayatraఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు తప్ప ప్రతిపక్షాలు సభలు, సమావేశాలు నిర్వహించుకూడదు. పాదయాత్రలు, బస్సుయాత్రలు చేయకూడదు. నిరసనలు, ర్యాలీలు చేయకూడదు. చేస్తే కరెంట్ పోవచ్చు. రాళ్ళ దాడి జరగవచ్చు. ఒకవేళ ప్రతిపక్ష నేతలు రాష్ట్రంలో పర్యటించాలంటే అందుకు బలమైన కారణం చెప్పాలి. అది వైసీపీ నేతలకి నచ్చాలి. అఫ్ కోర్స్ పోలీసులకి కూడా! అయినా వైసీపీ విమర్శలు, ఆరోపణలు తప్పవు.

ఇదీ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ వాతావరణం. ఇటువంటి అవాంఛనీయ పరిస్థితులలో కూడా టిడిపి, జనసేనలు పోరాడుతూనే ఉండటం గొప్ప విషయమే. నిజానికి టిడిపి ముఖ్య నేతల ఆర్ధిక మూలాలను దెబ్బతీసి ఆ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసేశామని వైసీపీ సంబరపడింది. కానీ వైసీపీ ప్రభుత్వ స్వయంకృతాపరాధాలే మళ్ళీ టిడిపికి ఆయువు పోసి ఎదురొడ్డి పోరాడేస్థాయికి ఎదిగేలా చేశాయి. కనుక ఇప్పుడు టిడిపి, జనసేనలను రాజకీయంగా ఎదుర్కోవడం మినహా మరో గత్యంతరం లేకుండా పోయింది.

ADVERTISEMENT

టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ట్రంలో పాదయాత్ర, బస్సుయాత్ర చేయబోతున్నారనే వార్తలపై మంత్రి మేరుగ నాగార్జున వైసీపీ కోణంలో స్పందించారు.

ఈరోజు ఆయన ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “ఆనాడు దళితుల పట్ల అనుచితంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు అంబేడ్కర్ విగ్రహం వద్ద ముక్కు నేలకు రాసి అందరికీ క్షమాపణలు చెప్పాలి. లేకుంటే నారా లోకేష్‌ పాదయాత్రని అడ్డుకొంటాము.

పవన్‌ కళ్యాణ్‌ నిజంగా ముఖ్యమంత్రి కావాలనుకొంటే దమ్మున్న రాజకీయాలు చేయాలి తప్ప చంద్రబాబు నాయుడు, టిడిపిల కోసం బస్సుయాత్రలు చేయడం దేనికి? జగనన్న ఇళ్ళ గురించి పవన్‌ కళ్యాణ్‌ నోటికి వచ్చిన్నట్లు ఏదో వాగేసి వెళ్ళిపోయారు. అసలు ఆయన జన్మలో ఏనాడైనా, ఎక్కడైనా ఇటువంటి గొప్ప అద్భుతమైన కాలనీలను చూశారా? సిఎం జగన్మోహన్ రెడ్డి నిరుపేద ప్రజల కోసం ఆలోచించి ఇళ్ళు నిర్మించి ఇస్తుంటే, పవన్‌ కళ్యాణ్‌ వంటివారు టిడిపి కోసం నీచరాజకీయాలు చేస్తూ మా ప్రభుత్వంపై బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారు.

టిడిపి, జనసేనల నేతలకి ప్రజలే తగిన విదంగా బుద్ధి చెపుతారు. ఢిల్లీలో ఉన్నది ప్రధాని నరేంద్రమోడీయా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాయా అనేది మాకు ముఖ్యం కాదు. రాష్ట్ర ప్రయోజనాలకు ఎవరు సహకరిస్తే వారే మాకు ముఖ్యం. పోలవరం ప్రాజెక్టు గురించి తెలంగాణ మంత్రులు ఏదో అంటే పట్టించుకోము. మేము తెలంగాణ రాజకీయాలలో తలదూర్చము. మాకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధే ఏకైక అజెండా,” అని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories