ప్రభుత్వాల పనితీరు, విధానాలు, నిర్ణయాలపై ప్రతీ ఒక్కరికీ భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం. కనుక ఏదీ కూడా అందరికీ ఆమోదయోగ్యం కాదు. అలాగని ప్రతీ దానినీ ప్రజలు వ్యతిరేకించరు. కనుక ప్రభుత్వాలు మెజార్టీ ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేలా జాగ్రత్త పడుతుంటాయి. అయినప్పటికీ వ్యతిరేకత, విమర్శలు తప్పవు.
ఉదాహరణకు ప్రముఖ ప్రవచనకారులు గరికపాటి నరసింహారావు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ పాఠశాలలలో మధ్యాహ్న భోజనం పధకంపై చేసిన తాజా విమర్శలే!
ముంబయి తెలుగు సమితి వారు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయనేమన్నారంటే, “ఈ మధ్యాహ్న భోజన పధకం అవసరం లేదు. విద్యార్ధులకు స్కూలు యూనిఫారాలు, పుస్తకాలు కూడా ఈయాల్సిన అవసరం లేదు. కానీ రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు తమతమ రాజకీయ ప్రయోజనాల కోసమే వీటిని నడిపిస్తున్నాయి. పిల్లలకు మధ్యాహ్న భోజనాలపై ఉన్న శ్రద్ధ చదువులపై ఉండటం లేదు.
అలాగే ఈ పధకం సక్రమంగా అమలయ్యే బాధ్యత ఉపాధ్యాయులపై పెట్టడంతో వారు కూడా పిల్లలకు చదువులు చెప్పలేకపోతున్నారు. కనుక ఈ పధకంతో సహా విద్యార్ధులకు స్కూలు యూనిఫారాలు, పుస్తకాలు అన్నిటినీ తక్షణం నిలిపేయాలి. ప్రభుత్వం బాధ్యత పిల్లలకు మంచి చదువు చెప్పించడం వరకే. అది చేస్తే చాలు,” అని అన్నారు.
చద్దన్నం తిన్నమ్మకి మొగుడాకలి తెలియదన్నట్లు కడుపు నిండినవారికి నిరుపేద కుటుంబాల నుంచి వచ్చే పిల్లల ఆకలి బాధ కూడా తెలియదు.
ఆ పేదరికం కారణంగా చదువులు మానేస్తున్న పిల్లలను పాఠశాలలకు రప్పించి చదువులు చెప్పడానికే ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పధకం ప్రవేశపెట్టాయి.
నిరుపేద విద్యార్ధుల కడుపు నింపి, వారికి స్కూలు యూనిఫారాలు, పుస్తకాలు ఉచితంగా ఇస్తే చదువుకోవాలనే ఆసక్తి ఏర్పడుతుంది. తల్లితండ్రులు కూడా వారి చదువులు తమకు భారం కావని గ్రహించి పిల్లలని పాఠశాలకు పంపిస్తారు.
కాస్త ఆదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలని ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేస్తారు. వారి ఫీజులు కట్టుకునే స్తోమత ఉంది కనుక వారికి భోజనం, స్కూలు యూనిఫారాలు, పుస్తకాలు అన్నీ తల్లితండ్రులే చూసుకుంటారు.
కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వారు నిరుపేద పిల్లలే. కనుక ఈ మధాహ్న భోజన పధకం వారికి చాలా చాలా అవసరం. అది ఎంత అవసరమో తెలియాలంటే ఇలాంటి సలహాలు ఇచ్చేవారు ఓసారి మధ్యాహ్నం భోజన సమయానికి పాఠశాలకు వెళ్తే అర్ధమవుతుంది.
అయితే మధ్యాహ్న భోజన పధకం కోసం ఇంత ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు వాటిని మరింత సమర్ధంగా నిర్వహించేందుకు తగిన వ్యవస్థ, యంత్రాంగం ఏర్పాటు చేసి ఉపాధ్యాయులను ఈ అదనపు బాధ్యతల నుంచి విముక్తి కల్పిస్తే ఇలాంటి విమర్శలు వచ్చేవి కావు.
అనవసరమైన పధకాలు, వాటి ప్రచారం, ప్రజా ప్రతినిధుల ఆర్భాటాలపై విచ్చలవిడిగా ఖర్చు చేయడం తగ్గించుకోవచ్చు. అలాగే విగ్రహాల ఏర్పాటుకు వందల కోట్లు ఖర్చు, శాసనసభ సమావేశాలకు రాని వారికి ఏటా కోట్లాది రూపాయలు జీతభత్యాలు చెల్లిస్తుండటం, రిషికొండపై నిరుపయోగంగా పడున్న భవనాలపై ఏటా కోట్ల రూపాయలు ఖర్చులు… ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈ వృదాఖర్చులు తగ్గించుకుంటే ఇలాంటి అత్యవసరమైన పధకాలను మరింత సమర్ధంగా నిర్వహించవచ్చు. అప్పుడు ఎవరూ ఇలా వేలెత్తి చూపలేరు కూడా!






