అంబటి రాంబాబు మంత్రి అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కానీ ఏ శాఖకి మంత్రో చాలా మందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన ఏనాడూ తన శాఖ గురించి మాట్లాడింది లేదు. మీడియా ముందుకు వచ్చినా, సోషల్ మీడియా ట్వీటేసినా అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ల గురించే అయ్యుంటుంది కనుక!
ఆయన పాండిత్యం చూసి జగన్మోహన్ రెడ్డి ప్రసన్నం అయిన్నట్లు తెలుస్తోంది. ఆయనకు మళ్ళీ సత్తెనపల్లి నుంచి పోటీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది.
కనుక ఈసారి సంక్రాంతి పండుగకి కూడా సత్తెనపల్లిలో మన సంబరాల రాంబాబుగారి రికార్డింగ్ డ్యాన్స్ తప్పక ఉంటుంది. టికెట్ ఖరారు అయ్యింది కనుక ఈసారి మరింత హుషారుగా చేయవచ్చు కూడా. ఆయనతో మంత్రి రోజా కూడా నాలుగు స్టెప్పులు వేస్తే ఇంకా బాగుండేది. ఆమెకీ జగన్ టికెట్ ఖరారు చేయడంతో బహుశః ఆమె నగరిలో ప్రోగ్రాం పెట్టుకొన్నారేమో?
సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు అంటే ఆ ముచ్చటే వేరు. సంక్రాంతికి లక్కీ లాట్రీ.. బంపర్ డ్రా తప్పనిసరి. కనుక పట్టణంలో ప్రతీ ఇంటికి రూ.100 చొప్పున ఆయన అనుచరులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పట్టణంలో టీకొట్లు, కూరగాయల దుకాణాలు మొదలుకొని బట్టలు, బళ్ళు అమ్మే షోరూముల వరకు అన్నిటికీ చందా పుస్తకాలు బలవంతంగా అంటగట్టి డబ్బు వసూలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
మంత్రి అంబటి ఆనంద తాండవం చేసేందుకు టికెట్లు చించుతుంటే, సత్తెనపల్లి టిడిపి అభ్యర్ధిగా ఖరారైన కన్నా లక్ష్మినారాయణ ఏమి చించుతున్నారో తెలీడం లేదు. ఆయన కూడా ఈ సంక్రాంతికి సత్తెనపల్లిలో నాలుగు స్టెప్పులు వేస్తే జనాలు గుర్తుపెట్టుకొంటారు కదా… సంబరాల రాంబాబుని గుర్తుచేసుకొంటున్నట్లు!




