ఏపీ విద్యావ్యవస్థను సమూలంగా మార్చేసి పేద విద్యార్థులకు సైతం అంతర్జాతీయస్థాయి విద్యని అందిస్తామని చెపుతూ జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయోగాలతో ప్రాధమిక, ప్రాధమికోన్నత విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిపోతోంది.
ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల తల్లితండ్రుల ఆర్ధిక, సామాజిక పరిస్థితులను, విద్యార్థుల అవగాహనశక్తి వంటివి పరిగణనలోకి తీసుకోకుండా వారిపై బలవంతంగా ఇంగ్లీష్ మీడియం, టోఫెల్ శిక్షణ, బైజూస్ ఆన్‌లైన్ పాఠాలు రుద్దుతోంది. వాటి కోసం పిల్లలకు ట్యాబ్స్ ఇవ్వడం మరో పొరపాటు.
ప్రభుత్వం రకరకాల ప్రయోగాలు చేస్తూ వారి జీవితాలతో, వారి భవిష్యత్‌తో కూడా ఆటలాడుకొంటోందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వం ఉపాధ్యాయులతో కూడా చెలగాటం ఆడుతోంది. వారిపై రకరకాలు ఒత్తిడి పెంచుతూ, ఆందోళనకు గురిచేస్తోంది. ఉపాధ్యాయుల హాజరు మొదలు ప్రతీరోజూ ఆన్‌లైన్ రిపోర్టింగ్ వంటి అనేక పనులు అప్పజెపుతుండటంతో వారిపై పని ఒత్తిడి చాలా పెంచేసింది. స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పడంతో వారి డ్యూటీ ముగిసిపోడు. ఇంటికి చేరుకొన్నాక అర్దరాత్రి వరకు హోమ్ వర్క్ పుస్తకాలో లేదా వారి పరీక్షాపత్రాలో దిద్దక తప్పడం లేదు. అవన్నీపూర్తయ్యాక మళ్ళీ ఆన్‌లైన్ రిపోర్టింగ్ కూడా చేయవలసి వస్తోందంటే వారి పరిస్థితి అర్దం చేసుకోవవచ్చు.
కనుక విద్యావ్యవస్థలో ఈవిదంగా మితిమీరిన ప్రభుత్వ జోక్యం వలననే పిల్లల చదువులకు ఆటంకాలు ఏర్పడుతున్నట్లు అర్దమవుతోంది. కానీ రోగం ఒకటైతే మందు మరొకటి వేస్తున్నట్లు మంత్రి బొత్స నిన్న విజయవాడలో తన శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైనప్పుడు, పిల్లలకు మానసిక స్థైర్యం పెంపోందించేందుకు మండలానికో కౌన్సిలర్‌ని నియమించబోతున్నట్లు ప్రకటించారు!
ఉపాధ్యాయులలో చిత్తశుద్ధి, పట్టుదల, నిరంత కృషి ఉంటే విద్యార్థులు తప్పకుండా చదువులలో రాణిస్తారని మంత్రి బొత్స అన్నారు. తల్లితండ్రులు, ఉపాధ్యాయులే పూర్తి బాధ్యత తీసుకొని విద్యార్థులను తీర్చిదిద్దాలని మంత్రి అన్నారు. ఆయనకీ, ప్రభుత్వానికి కూడా ఉపాధ్యాయులపై నమ్మకం లేదనే సంగతి మొబైల్ అటెండన్స్‌తోనే బయటపడింది. ఇప్పుడు ఆయన వారి చిత్తశుద్ధిని కూడా శంకిస్తున్నారు!
ప్రభుత్వం ఈవిదంగా వ్యవహరిస్తుంటే మంచి ఫలితాలు ఎలా వస్తాయి? కనుక ముందు విద్యావ్యవస్థపై ఈ ప్రయోగాలు చేయడం మానుకొని దానిలో అతిగా జోక్యం చేసుకోకుండా కాస్త దూరంగా ఉంటూ అవసరమైన తోడ్పాటు అందిస్తే చాలు. ఉపాధ్యాయులే మెరుగైన ఫలితాలు సాధించి చూపగలరు.



