ఇదివరకు తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన కుమారుడు కేటీఆర్ మునిసిపల్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండేవారు. ఆ మూడు శాఖలపై ఆయన పూర్తి పట్టు సాధించడమే కాకుండా సమర్ధుడుగా మంచి పేరు సంపాదించుకున్నారు కూడా.
అదే సమయంలో ఏపీ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రిగా గుడివాడ అమర్నాధ్ ఉండేవారు. కానీ పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు రప్పించడంలో కేటీఆర్‌కి కనీసం పోటీ ఇవ్వలేకపోయేవారు. ఎల్లప్పుడూ తమ అధినేత జగన్ భజన చేస్తూ ఆయన మెప్పు కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లను విమర్శిస్తూ కాలక్షేపం చేసేవారు. కోడి గుడ్డూ అంటూ ఆయన చెప్పిన పిట్టకధతో గుడ్డు మంత్రిగా మిగిలిపోయారు. మంత్రి పదవి దక్కినా రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయిన ఓ అసమర్దుడిగా దిగిపోయారు.
ఇప్పుడు నారా లోకేష్ ఆ పదవిని చేపట్టడంతో సహజంగానే అందరూ ఆయనను కేటీఆర్‌తో పోల్చి చూస్తారు. ఇటీవల ఓ జాతీయ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ చరిత్రలో లక్షల ఉద్యోగాల సృష్టికర్తగా నిలిచిపోవాలని కోరుకుంటున్నానని నారా లోకేష్ అన్నారు.
నిజానికి నారా లోకేష్‌కి మాత్రమే కాదు మంత్రి పదవి చేపట్టిన ప్రతీ ఒక్కరికీ తమ సమర్ధత నిరూపించుకునేందుకు గొప్ప అవకాశం లభించిందని గుర్తిస్తే రాష్ట్రానికి, తమకి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఎంతో చేయగలరు.
ఇదివరకు జలవనరుల మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు ‘నాకు పోలవరం ప్రాజెక్టు గురించి ఏమీ తెలియదని’ నిర్లజ్జగా చెప్పేశారు. మంత్రిననే విషయం కూడా మరిచి రోడ్లపై డ్యాన్సులు చేసి ప్రజల దృష్టిలో తన స్థాయిని దిగజార్చుకున్నారు.
కానీ ఇప్పుడు ఆ శాఖ బాధ్యతలు చేపట్టిన నిమ్మల రామానాయుడు ఇటీవల విజయవాడ వరదలు వచ్చినప్పుడు రేయింబవళ్లు బుడమేరు వద్ద నిలబడి ఏవిదంగా గండ్లు పూడ్పించారో అందరూ చూశారు. ఇప్పుడు పోలవరం డయాఫ్రం వరంగల్ నిర్మాణ పనుల గురించి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ మంత్రిగా తన బాధ్యతని నిర్వర్తిస్తున్నారు.
అదేవిదంగా నారా లోకేష్ కూడా విద్యాశాఖ మంత్రిగా విద్యాశాఖలో ఏర్పడిన లోపాలను, సమస్యలను సరిచేస్తూ విద్యావ్యవస్థను మళ్ళీ గాడిన పెట్టారు. మరోపక్క ఐటి, పరిశ్రమల మంత్రిగా రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటి కంపెనీలు రప్పించేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు.
ఇప్పటికే లూలూ గ్రూప్ యాజమాన్యంతో మాట్లాడి ఏపీలో ఫుడ్ ప్రొసెసింగ్ పరిశ్రమలు, షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేసేందుకు ఒప్పించారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
నారా లోకేష్ మంత్రిగా లభించిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయం ఉండేలా చేసుకుంటారని ఆశిద్దాం. మిగిలిన మంత్రులు కూడా ఇదే స్పూర్తితో పనిచేసి మంచి పేరు సంపాదించుకుంటే, వచ్చే ఎన్నికలలో ప్రజలే వారిని గెలిపించుకుంటారు.




