జీవితంలో ఎప్పటికైనా మంత్రి అనిపించుకోవాలని ఎంతగానో తహతహలాడిన ఆర్‌కె. రోజాకు ఆ ముచ్చట తీర్చుకోనీయకుండా జిల్లాకే చెందిన మరో మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిల్లాలో తనదే పైచేయిగా ఉండేలా పావులు కడుపుతుండటంతో మంత్రి రోజా ఇంతకాలం ఈవిషయం పైకి చెప్పుకోలేక మనసులో దాచుకోలేక చాలా నరకం అనుభవిస్తున్నారు.
అప్పటికీ సీనియర్ అయిన పెద్దిరెడ్డితో గొడవలు ఎందుకని ఆమె చాలా దూరంగా ఉంటున్నారు. చివరికి ఆయన వర్గానికి చెందిన శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, వడమాల జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి, ఈడిగ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కేజే శాంతి, నగరి మునిసిపల్ మాజీ ఛైర్మన్ కేజే కుమార్, విజయపురానికి చెందిన లక్ష్మీపతి రాజు పుత్తూరుకి చెందిన ఏలుమలై తదితరులకు కూడా మంత్రి రోజా దూరంగానే ఉంటున్నారు.
కానీ పెద్దిరెడ్డి వర్గం మాత్రం తనకు రోజూ నరకం చూపుతూనే ఉన్నారని మంత్రి రోజా స్వయంగా ఇటీవల తన అనుచరులకు చెప్పుకొని బాధపడుతున్న ఫోన్ సంభాషణ బయటకు పొక్కడంతో వారి మద్య విబేధాల గురించి పార్టీలో కింద నుంచి పైవరకు అందరికీ తెలిసిపోయింది. ఇటీవల తాను లేని సమయంలో నగరి నియోజకవర్గంలో వారందరూ రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్ సెంటరుకు శంకుస్థాపన చేయడంపై మంత్రి రోజా ఆవేదన చెందుతూ కన్నీళ్ళు పెట్టుకొన్నారు.
ఇంతకాలం ఎంతో సహనంగా వ్యవహరిస్తున్నప్పటికీ మంత్రినయ్యాననే సంతోషం కూడా లేకుండా చేస్తున్న తోటి మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఆయన వర్గానికి చెందిన నేతలపై మంత్రి రోజా బుదవారం సిఎం జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. వారు నియోజకవర్గంలో తనని బలహీనపరిచి దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారని కనుక వారిని నియంత్రించాలని మంత్రి రోజా సిఎం జగన్మోహన్ రెడ్డికి మొరపెట్టుకొన్నట్లు సమాచారం.
అయితే జిల్లా రాజకీయాలలో చక్రం తిప్పగల సమర్ధుడైన మంత్రి అయిన పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, చంద్రబాబు నాయుడుని, పవన్ కళ్యాణ్ తిట్టడానికి మాత్రమే పరిమితమవుతున్న మంత్రి రోజాలలో సిఎం జగన్మోహన్ రెడ్డి ఎవరికి ప్రాధాన్యం ఇస్తారో తేలికగానే ఊహించుకోవచ్చు. కనుక ఆమెకు మంత్రి పదవి ముళ్లకుర్చీగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మరి రోజమ్మ ఎలా నెగ్గుకు వస్తుందో చూడాలి.



