ప్రధాని మోడీ గురువారం ఏపీ, తెలంగాణ బీజేపి ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన, “ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఆద్భుతంగా పనిచేస్తోంది. కానీ ప్రభుత్వం పని తీరు బాగేలేదంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. వైసీపీ విమర్శలను ఏపీ బీజేపి బలంగా తిప్పి కొడుతూ సిఎం చంద్రబాబు నాయుడుకి అండగా నిలవాలి,” అని సూచించారు.
తెలంగాణలో బీజేపి బలపడేందుకు మంచి అవకాశం ఉన్నప్పటికీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపియే అని నిరూపించుకోవడంలో విఫలం అయ్యారన్నారు. కనుక అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ తెలంగాణలో బీజేపిని బలోపేతం చేయాలని ప్రధాని మోడీ సూచించారు.
కానీ ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలలో బీజేపి అధిష్టానం వైఖరే స్పష్టంగా లేదని చెప్పక తప్పదు. ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పట్ల, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పట్ల బీజేపి అధిష్టానం మెతక లేదా ద్వంద వైఖరి అవలంభిస్తుండటం వల్లనే రెండు రాష్ట్రాలలో బీజేపి నేతలు ముందుకు సాగలేకపోతున్నారు.
ఉదాహరణకు కాళేశ్వరం అవినీతి కేసుపై సీబీఐ చేత విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ వ్రాసి మూడు నెలలు అవుతోంది. కానీ పట్టించుకోలేదు.
కేసీఆర్, కేటీఆర్‌లను అరెస్ట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వమే అడ్డుపడుతోందని వారిని కేంద్రమే కాపాడుతోందని సిఎం రేవంత్ రెడ్డి బహిరంగంగానే చెపుతున్నారు కదా?
బీఆర్ఎస్ పార్టీని బీజేపిలో విలీనం చేయాలని తన తండ్రి కేసీఆర్ అనుకున్నారని కల్వకుంట్ల కవిత స్వయంగా బయటపెట్టారు కదా? కనుక బీఆర్ఎస్ పార్టీ పట్ల బీజేపి అధిష్టానానికి వేరే ఏవో ఆలోచనలు ఉండి ఉండవచ్చనిపిస్తుంది.
సిఎం రేవంత్ రెడ్డి మొక్కుబడిగా బీజేపిని విమర్శిస్తుంటారు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని పెద్దగా విమర్శించరు. ప్రధాని మోడీ కూడా సిఎం రేవంత్ రెడ్డి పట్ల సానుకూలంగా ఉన్నట్లే వ్యవహరిస్తుంటారు. మరి తెలంగాణ బీజేపి నేతలు ఏవిధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో యుద్ధం చేయగలరు?
ఇక్కడ ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పట్ల కూడా బీజేపి అధిష్టానం చాలా మెతక వైఖరి అవలంభిస్తుంటుంది. లేకుంటే అక్రమాస్తుల కేసులు, వివేక హత్య కేసు, ఏపీ మద్యం కుంభకోణం కేసులు ఈవిధంగా ఇన్నేళ్ళపాటు నత్తనడకలు నడుస్తాయా?
జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు ఎల్లప్పుడూ చంద్రబాబు నాయుడునే విమర్శిస్తుంటారు తప్ప కూటమి ప్రభుత్వంలోని బీజేపి మంత్రులను కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని గానీ విమర్శించరు. ఎందువల్ల? అంటే కేసుల వల్లే అని అందరికీ తెలుసు.
అందువల్లే తిరుమలలో కల్తీ నెయ్యి, పరకామణి వంటి అంశాలతో ఏపీ బీజేపికి మంచి అవకాశాలు లభించినప్పటికీ వారు మౌనంగా ఉండిపోయారు.
కనుక కాంగ్రెస్, బీఆర్ఎస్, వైసీపీ మూడు పార్టీల పట్ల బీజేపి అధిష్టానం వైఖరే అస్పష్టంగా ఉందని చెప్పక తప్పదు. కనుక ముందుగా దానికి స్పష్టత ఉంటేనే, రాష్ట్ర స్థాయి బీజేపి నాయకులకు ఏవిధంగా ముందుకు సాగాలో వారికీ అర్ధమవుతుంది.







