నల్ల కుభేరులపై మోడీ కొత్త కొరడా!

modi-arun-jaitley-black-money-new-shock-tax-rulesనల్లకుభేరుల వెన్నులో వణుకుపుట్టేలా ఆదాయపన్ను చట్టాన్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఐటీ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. శుక్రవారం నాడు జరిగిన కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీలో ఈ బిల్లు చర్చలు జరుపగా, తాజాగా చట్టసభలలో ప్రవేశపెట్టారు. ఈ పథకానికి “ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన” (పీఎంజీకేవై) 2016 అని నామకరణం చేసారు.

ఈ పథకం ప్రకారం 2017 ఏప్రిల్ 1వ తేదీలోగా తమ బ్యాంక్ అకౌంట్లలోకి లెక్కల్లో చూపని డబ్బును జమ చేసే వారికి మొత్తం డిపాజిట్ మీద 30 శాతం ట్యాక్స్, 10 శాతం పెనాల్టీ విధిస్తారు. దీనికి తోడు మరో 10 శాతాన్ని గరీబ్ కళ్యాణ్ సెస్ కింద వసూలు చేస్తారు. అంటే, మొత్తం డబ్బులో 50 శాతం చెల్లించాల్సి ఉంటుందన్న మాట. మిగిలిన 50 శాతం మొత్తంలో సగం (అసలులో 25 శాతం) వెంటనే తీసుకోవచ్చు. మిగిలిన సగాన్ని మాత్రం నాలుగేళ్ల పాటు లాక్ చేస్తారు. ఈ మొత్తానికి వడ్డీ కూడా చెల్లించరు.

ADVERTISEMENT

మరో విషయం ఏమిటంటే… ఈ పథకం కింద డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఏ ఏడాది కూడా ఆదాయపన్ను డిక్లరేషన్ లో చూపించరాదు. పై పథకం ద్వారా కూడా డబ్బును స్వచ్ఛందంగా బ్యాంకుల్లో జమ చేయకపోతే, కష్టాలను కొని తెచ్చుకున్నట్టే. అధికారుల దాడుల్లో నల్లధనం దొరికితే 60 శాతం పన్ను విధించడమే కాకుండా… అదనంగా 15 శాతం సర్ ఛార్జిని, 10 శాతం పెనాల్టీని విధిస్తారు. అంటే 85 శాతం కట్టాల్సి ఉంటుందన్న మాట.

మరో విషయం ఏమిటంటే, ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఈ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం పొందేలా కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోంది. దీనికి సంబంధించి అన్ని పార్టీలతో ఇప్పటికే చర్చలను ప్రారంభించింది. ఈ బిల్లును విజయవంతంగా అమలు చేయగలిగితే… ప్రజలలో ఎక్కువ శాతం మంది తన ఇన్ కం టాక్స్ రిటర్న్స్ ను ఫైల్ చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే బిల్లు ఆమోదానికి లోక్ సభలో బిజెపికి ఎదురు ఉండకపోవచ్చు గానీ, రాజ్యసభలో మాత్రం అనుకూల వాతావరణం లేకపోవడం గమనించదగ్గ విషయం.

ADVERTISEMENT
Latest Stories