
నగదు రహిత భారతావనిని సృష్టించే దిశగా నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రతి డిజిటల్ లావాదేవీ పైన 10 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. జిల్లాలు, తాలూకాలు, పంచాయతీల్లో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని మరింతగా పెంచేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని భావిస్తోంది.
ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్కరిని డిజిటల్ విధానంలోకి చేర్చి, వారితో రోజువారీ కొనుగోళ్లలో కనీసం రెండు సార్లు డిజిటల్ లావాదేవీల వైపు మళ్లించే అధికారులకు కూడా 10 రూపాయలను ఇన్సెంటివ్ గా ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు నీతి ఆయోగ్ కొత్త విధానాన్ని తయారు చేసి, ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. దీనిపై క్యాబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి వుంది. క్యాష్ బ్యాక్ కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
ఇదిలా ఉంటే… నగదు చెల్లింపులపై అన్ని ప్రభుత్వ శాఖలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కీలక ఆదేశాలు జారీ చేశారు. కాంట్రాక్టర్లు, వ్యాపారులకు 5 వేల రూపాయలకు మించిన బిల్లులన్నింటికీ ఈ-పేమెంట్ సౌకర్యాన్ని వాడుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ చెల్లింపులన్నీ డిజిటలైజ్ చేసి, ఈ-పేమెంట్స్ ను ప్రోత్సహించాలన్న సంకల్పంతో అన్ని మంత్రిత్వ శాఖలకు ఈ ఉత్తర్వులను జారీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. కాగా, గత ఆగస్టులో నగదు చెల్లింపులపై 10 వేల వరకు పరిమితి విధించగా, ఇప్పుడు దానిని కేంద్రం 5 వేలకు కుదించడం గమనార్హం.



