కాపులను బీసీల్లో చేర్చాలంటూ పట్టుబడుతున్న వేళ… ఈ అంశంతో సంబంధం లేకుండా రాజధాని రైతుల గురించి ప్రస్తావించే నాయకుడు ఏపీలో ఎవరున్నారని అన్వేషిస్తే… టక్కున “ఒకే ఒక్కడు” మెగాస్టార్ చిరంజీవి గారు గుర్తుకు వస్తారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో! అలా… రాజకీయాల్లో ఏ మాత్రం అవగాహన లేకుండా ప్రసంగించడంలో చిరు ‘స్పెషాలిటీ’ అన్నది నేడు కొత్తగా తెలుసుకున్నది కాదు. ‘ప్రజారాజ్యం’ నుండి మొన్నటి ‘కాంగ్రెస్’ వేదికలపై వరకు చిరంజీవి ప్రసంగించిన విధానాలపై విమర్శకులు, విశ్లేషకులు, ప్రత్యర్ధి పార్టీ వర్గాలు వ్యక్తపరిచిన ‘ఏకాభిప్రాయం’ అది.
బహుశా ఈ విషయాలపై ఏపీ మంత్రివర్యులు నారాయణ గారికి సరైన అవగాహన లేనట్లుగా కనపడుతోంది. సీఎం చంద్రబాబుకు చిరు రాసిన లేఖను ఉదహరిస్తూ… “సీఆర్డీఏ చట్టంపై చిరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, అలా ఏది పడితే అది మాట్లాడి ఓ సాధారణ వ్యక్తిలా రైతులను రెచ్చగొట్టవద్దని, పెద్ద ఎత్తున కొన్ని కార్యక్రమాలు చేస్తున్నపుడు కొంత మందికి ఇబ్బంది కలుగడం సహజమేనని, ప్రభుత్వం చట్టప్రకారమే వ్యవహరిస్తోందని” మెగాస్టార్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
వర్ధమాన నటుడు శివాజీ మాట్లాడే తీరు కంటే దయనీయంగా చిరు ప్రసంగాలు ఉంటాయని వీరాభిమానులు బహిరంగంగా చెప్పకపోయినా, అంతర్లీనంగా అందరి మదిలో అభిప్రాయాలే ఇవి. మరి అలాంటి చిరు వ్యాఖ్యలకు ప్రాధాన్యతనిస్తూ మంత్రి గారు బదులివ్వడం అనేది వివాదాలు లేకుండా చూసుకోవడం కోసమేనా? అన్న ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి.



