తెలంగాణ సిఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాలలో ప్రవేశించేందుకు సిద్దమవుతున్నందున మునుగోడు శాసనసభ ఉపఎన్నికల ఫలితాలు ఏవిదంగా ఉంటాయో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి నల్గొండ పట్టణంలో ఎఫ్‌సీఐ గోడౌన్‌లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇప్పటి వరకు 4 రౌండ్లు కౌంటింగ్ పూర్తవగా టిఆర్ఎస్‌కి 26,4333 ఓట్లు, బిజెపికి 25,729, కాంగ్రెస్‌కి 7,380 ఓట్లు పోల్ అయ్యాయి. అంటే టిఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పార్టీ 714 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారన్న మాట.
మొత్తం 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తిచేస్తారు. ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్ విజయం సాధించబోతోందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. అయితే బిజెపి అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామమాత్రపు ఆధిక్యతోనైనా గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉపఎన్నికలను అత్యంత శక్తివంతమైన టిఆర్ఎస్, బిజెపిలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడటంతో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన పాల్వాయి స్రవంతి ఓటమి ముందే ఖరారు అయిపోయింది.
ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్ గెలిచినా, ఓడినా అది కేసీఆర్ పద్దులోనే జమా అవుతుంది కనుక ఈ ఉపఎన్నికలలో గెలిస్తే జాతీయ రాజకీయాలలోకి గర్వంగా అడుగుపెట్టగలుగుతారు. ఓడిపోతే ఆదిలోనే హంసపాదు అన్నట్లు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. టిఆర్ఎస్ నుంచి బిజెపిలోకి వలసలు పెరిగే అవకాశం ఉంటుంది.
ఈ ఉపఎన్నికలలో బిజెపి గెలిస్తే తెలంగాణలో ఇంకా రెచ్చిపోవడం ఖాయం. ఒకవేళ ఓడిపోతే బిజెపి మళ్ళీ పుంజుకోవడానికి చాలా కాలం పట్టవచ్చు. ఈలోగా కేసీఆర్ బిజెపిలో నేతలను కూడా టిఆర్ఎస్‌లోకి ఫిరాయింపజేసుకొని ఆ పార్టీని కూడా నిర్వీర్యం చేసేందుకు తప్పక ప్రయత్నిచవచ్చు. కనుక తమ బలాబలాలను తేల్చుకోవాలని చేజేతులా ఈ ఉపఎన్నికలను తెచ్చిపెట్టుకొన్న ఆ రెండు పార్టీలకు ఇది నిజంగానే అగ్నిపరీక్షే!



