జగన్మోహన్ రెడ్డి, షర్మిల మద్య ఆస్తుల వివాదంతో రచ్చరచ్చ చేసుకుంటున్నప్పుడు వారి తల్లి విజయమ్మ కూతురు పక్షాన్న నిలిచారు. జగన్మోహన్ రెడ్డి తమని మోసం చేశాడంటూ షర్మిల వ్రాసిన బహిరంగ లేఖపై ఆమె సంతకం చేశారు. తద్వారా ఆమె కూడా కొడుకు తీరుని తప్పు పట్టారు.
కానీ తాజాగా ఆమె మరో వీడియో సందేశం విడుదల చేసి, ఏ కుటుంబంలోనైనా అభిప్రాయబేధాలు సహజమని, అంతమాత్రన్న తల్లికి కొడుకు, కొడుకుకి తల్లి, అన్నకు చెల్లి, చెల్లికి అన్న కాకుండా పోతారా? అని ప్రశ్నించారు. తాను తన ఇద్దరు పిల్లలని చాలా సంస్కారవంతంగా పెంచానని విజయమ్మ చెప్పారు.
తన కారు టైర్లు మార్చాల్సివస్తే దానిపై కట్టుకధలు అల్లారని, తాను అమెరికాలో మనవల దగ్గరకు వెళితే దానిపై కట్టుకధలు అల్లి ప్రచారం చేశారని, ఇప్పుడు షర్మిల తన కూతురే కాదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ చూస్తుంటే తనకు చాలా బాధ కలుగుతోందని విజయమ్మ అన్నారు.
హుందాగా రాజకీయాలు చేసుకోవాలి తప్పితే ఈవిదంగా తమ కుటుంబాన్ని టార్గెట్ చేసుకొని వ్యక్తిత్వ హననం చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఇటువంటి దుష్ప్రచారం మానుకోవాలని లేకుంటే తమపై దుష్ప్రచారం చేస్తున్నవారిపై పరువు నష్టం దావాలు వేస్తామని విజయమ్మ హెచ్చరించారు.
లోకంలో ఏ తల్లి అయినా తన పిల్లలు చాలా మంచివారు, సంస్కారవంతులని చెప్పుకోవడం సహజమే. కనుక విజయమ్మ కూడా అలా చెప్పుకున్నారనుకోవచ్చు. అయితే ఆమె ఇద్దరు పిల్లలే ఆస్తుల కోసం కీచులాడుకుంటూ ఒకరినొకరు మోసం చేస్తున్నారని నిందించుకుంటున్నారు కదా?
వారంతట వారు ఆస్తుల కోసం రచ్చరచ్చ చేసుకొని వీధిన పడ్డారు కదా? అప్పుడు విజయమ్మ కూడా కూతురు పక్షాన్న నిలిచి కొడుకుని తప్పు పట్టారు కదా? కనుక తమ పరువు తామే తీసుకుంటూ ఎవరైనా ఆక్షేపిస్తే వారిపై పరువు నష్టం దావా వేస్తానని విజయమ్మ హెచ్చరించడం హాస్యస్పదంగా ఉంది.
రాష్ట్ర విభజన తర్వాత టిడిపి అధికారంలో ఉన్నప్పుడు, ఇటువంటి రాజకీయ వాతావరణం లేదని అందరికీ తెలుసు. అందువల్లే జగన్ స్వేచ్ఛగా పాదయాత్ర చేసుకొని, ప్రజల నమ్మకాన్ని పొంది అధికారంలోకి రాగలిగారు. చంద్రబాబు నాయుడు తలుచుకుంటే అప్పుడే వైసీపి, జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా బలపడకుండా అడ్డుకునేవారే కదా? కానీ అప్పుడు ఆయన ప్రజాస్వామ్యానికి కట్టుబడి పాలన సాగించడమే జగన్‌కు వరంగా మారింది.
ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ కూడా అదేవిదంగా ప్రజాస్వామ్యానికి కట్టుబడి పాలన చేసుకొని ఉంటే నేడు ఇటువంటి దుస్థితి కలిగి ఉండేదే కాదు. కానీ అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, టిడిపి నేతలను లక్ష్యంగా చేసుకొని ఎంతగా వేధించారో, ఎంతగా వారి వ్యక్తిత్వ హననం చేసేవారో విజయమ్మకి తెలియదా?
తన పిల్లలని చాలా సంస్కారవంతంగా పెంచానని చెప్పుకొంటున్న విజయమ్మ, సాటి మహిళలు భువనేశ్వరిని, పవన్ కళ్యాణ్ భార్య గురించి తన కుమారుడు, వైసీపి నేతలు అంత నీచంగా మాట్లాడుతున్నప్పుడు ఏనాడూ వారించలేదే?నేటికీ తన కుమారుడు జగన్, చెల్లికి అన్యాయం చేస్తుంటే ఆమె నచ్చజెప్పలేకపోతున్నారే?
టిడిపి తమ కుటుంబంపై బురద జల్లుతోందని ఆరోపిస్తున్న విజయమ్మ తమ సొంత కుటుంబ పత్రిక సాక్షిలోనే తనని ‘కళ్ళుండి చూడలేకపోతున్న గాంధారి’ అంటూ వ్యంగ్యంగా కధనాలు ప్రచురిస్తుంటే తప్పుగా అనిపించలేదా?
నేటికీ వైసీపి సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు, ప్రభుత్వం గురించి జుగుప్సాకరంగా బొమ్మలు వేసి దుష్ప్రచారం చేస్తుంటే విజయమ్మకి తప్పుగా అనిపించలేదా?
2014-19లో రాష్ట్రంలో ఇటువంటి రాజకీయాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఇలా ఎందుకు మారాయి?అనే ప్రశ్నకు సమాధానం అందరికంటే విజయమ్మకే బాగా తెలుసు. కనుక రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని విజయమ్మ బాధపడటం, దానికి ఎవరినో నిందించడం ఎంతవరకు సబబు?ఒకవేళ నిందించాలనుకుంటే ముందుగా ఆమె తన కొడుకు జగన్మోహన్ రెడ్డినే నిందించాల్సి ఉంటుంది తప్ప ఇతరులని కాదు.




