రాజకీయ ప్రసంగాలు అలవాటు లేని నారా భువనేశ్వరి చంద్రగిరిలో జరిగిన తన మొదటి బహిరంగ సభతోనే తన బ్లడ్ లోనే రాజకీయం ఉంది అనేలా తన ప్రసంగాన్ని మొదలుపెట్టి ముగించారు.తాము చేసే పని మీద చిత్తశుద్ధి ఉంటే, చెప్పే మాటలలో నిజాయితీ ఉంటే స్క్రిప్ట్ పేపర్ తో పనిలేదు అన్నట్లుగా భువనేశ్వరి ప్రసంగం కొనసాగింది.
తానూ ఇక్కడ రాజకీయాలు చేయడానికి రాలేదని, తన భర్తకు జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందుకు తీసుకురావడానికే వచ్చానంటూ, తనకు తన కుటుంబానికి, పార్టీకి అండగా నిలబడిన ప్రతి కుటుంబానికి పాదాభివందలు తెలియచేస్తున్నానంటూ మొదలు పెట్టిన భువనేశ్వరి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ఇప్పటివరకు రాష్ట్రానికి చంద్రబాబు చేసిన సేవలను, అభివృద్ధిని ప్రజలకు వివరించారు.
సైబరాబాద్ వంటి మహా నగరాన్ని నిర్మించి ఎన్నో వేల కుటుంబాలకు ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించి ఎందరో జీవితాలలో జ్యోతిని వెలిగించిన చంద్రబాబుని ఇప్పుడు ఈ ప్రభుత్వం జైల్లో నిర్బధించడం చూస్తే భాదేస్తుందని తన ఆవేదనను తెలియచేసారు. ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో మరో స్త్రీ కి రాకూడని నేను కోరుకుంటున్నా అన్నారు.
ఈ ప్రభుత్వం రాష్ట్రంలో అందరిపై కేసులు పెట్టి అరెస్టులు చేసి జైళ్లకు పంపించడం తప్ప అభివృద్ధి పై ద్రుష్టి పెట్టడం లేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక విధ్వంసాలు, అరాచకాలు, రేపులు తప్ప అభివృద్దే జరగలేదన్నారు. మహిళా భద్రత గాలికొదిలేసి రాజకీయ వేధింపులతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. చంద్రగిరి సభ సాక్షిగా భువనేశ్వరి చేసిన రాజకీయ ప్రసంగానికి సభలోని వారంతా ఆమెకు చప్పట్లతో తమ మద్దతు తెలిపారు.
మొదటి సారిగా బహిరంగ సభలో మాట్లాడుతున్నాం అన్న చిన్న భయం కానీ బెరుకు కానీ కంగారు కానీ భువనేశ్వరిలో మచ్చుకైనా కనపడక పోవడం చూస్తున్న వీక్షకులకు కాసంత ఆశ్చర్యాన్ని మిగిల్చిందని చెప్పాలి. కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్రలు చేసి కొన్ని వందల సభలను నిర్వహించి అధికార పీఠం ఎక్కిన జగన్ ఇప్పటికి తన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పేర్లు చెప్పటానికి కూడా ఒకటికి రెండు సార్లు పేపర్లు తిరగేయాల్సిన పరిస్థితే.
కనీసం ప్రతిపక్ష పార్టీల నేతలను తిట్టాలన్న ముందు స్క్రిప్ట్ పేపర్ లేకపోతే సమావేశం ముందుకు జరగని పరిస్థితి జగన్ ది అంటూ టీడీపీ శ్రేణులు జగన్ వీడియోలను షేర్ చేస్తున్నారు. చేసే పనిలో నిబద్దత, చెప్పే మాటలో నిజాయితీ ఉంటే పేపర్ తో పనేముందని భువనేశ్వరి తన మొదటి స్పీచ్ తోనే నిరూపించారు అంటూ తెగ సంబర పడిపోతున్నారు తెలుగు తమ్ముళ్లు.
43 రోజుల తమ ఆవేదనకు భువనేశ్వరి ప్రసంగం తమకు ఎంతో ఊరటనిచ్చింది అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఊహించని విజయం అందిపుచ్చుకున్న ఆటగాళ్ల మాదిరి తెలుగు దేశం క్యాడర్ రెట్టించిన ఉత్సహంతో ముందుకెళతాం అంటూ భువనేశ్వరికి తమ మద్దతు తెలియచేసారు.భువనేశ్వరి పర్యటనతో ప్రజలలో వచ్చిన అనూహ్య స్పందన చూసిన అధికార ప్రభుత్వం ఇక తమ నేతల నోటికి పని చెప్పడం ఖాయంగా కనపడుతుంది.
“నిజం గెలవాలి. నిజమే గెలవాలి” అనే నినాదంతో ఈ ప్రభుత్వంపై చేయి చేయి కలిపి మన పోరాటం కొనసాగిద్దాం అంటూ ప్రజలకు పిలుపునిచ్చి తన ప్రసంగాన్ని ముగించారు భువనేశ్వరి. రాజకీయాలలో ఇలా హుందాతనమైన విమర్శలు చేసి తన మొదటి ప్రసంగంతోనే పరిణితి సాధించారంటూ పొలిటికల్ సర్కిల్స్ లో భువనేశ్వరి పై ప్రశంసలు మొదలయ్యాయి. “చూసి చెప్పడం కాదు అందరు చూసేలా చెప్పారు”! భువనేశ్వరి గారు, అంటూ టీడీపీ నేతలు వైసీపీ నేతల పై సెటైర్లు వేస్తున్నారు.




