అమలాపురంలో ఈ నెల 24న అల్లర్లు జరిగినప్పుడు ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. ప్రస్తుతం అమలాపురంలో మళ్ళీ ప్రశాంత వాతావరణం నెలకొన్నప్పటికీ ఇంతవరకు ఇంటర్నెట్ సేవలు మాత్రం పునరుద్దరించలేదు. దీంతో పట్టణంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలతో సహా బ్యాంకులు, ఆన్‌లైన్ లావాదేవీలు నిలిచిపోయాయి. ఐటి ఉద్యోగులు, ఆన్‌లైన్ కోచింగ్ తీసుకొంటున్న విద్యార్ధులు, చిరు వ్యాపారులు చాలా ఇబ్బంది పడుతున్నారు.
అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, “మీ వైసీపీ ప్రభుత్వం ఎలాగూ రాష్ట్రానికి ఐటి కంపెనీలను తీసుకురాలేదు. ఇంటర్నెట్ సేవలు తక్షణమే పునరుద్దరిస్తే కనీసం ఐటి ఉద్యోగులైణా వారి పని వారు చేసుకోగలుగుతారు.
కశ్మీరులో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని వార్తలు వినిపించేవి. ఇప్పుడు మన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే అది వినవలసిరావడం చాలా బాధాకరం. ఇంటర్నెట్ కూడా ఇప్పుడు నిత్యావసరంగా మారిందనే సంగతి ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డికి తెలుసో తెలియదో కానీ తక్షణం అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు పునరుద్దరించాలి,” అని అన్నారు.
ఇంటర్నెట్ నిత్యావసరంగా మారిందనే సంగతి వైసీపీ మంత్రులకు తెలియకపోయినా రాష్ట్ర ఐటి మంత్రి గుడివాడ అమర్నాద్‌కి తప్పనిసరిగా తెలిసి ఉండాలి. కానీ వారం రోజులైనా అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించకపోవడం చూస్తే ఈ విషయం ఆయన దృష్టికి వచ్చిందో లేదో అనే అనుమానం కలుగుతోంది. ఒకవేళ రాకపోయుంటే చంద్రబాబు నాయుడే గుర్తుచేశారు కనుక ఇకనైనా అమలాపురంలో తక్షణం ఇంటర్నెట్ సేవలు పునరుద్దరిస్తే మంచిది.



